న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా, బంగ్లాదేశ్‌లోని ఉగ్ర గ్రూపుల అండదండలతో భారత్‌లో భారీ ఉగ్ర దాడికి కుట్ర పన్నారన్న అనుమానంతో 8 మంది వ్యక్తులను తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి. వీరిలో ఆరుగురు అనుమానితులను తమిళనాడు తిరుపూర్ జిల్లాలోని వస్త్ర తయారీ యూనిట్ల నుంచి అరెస్టు చేయగా ఇద్దరిని పశ్చిమ బెంగాల్లో అరెస్టు చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.
అరెస్టయిన అనుమానితుల్లో ఓ బంగ్లా దేశీయుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనుమానితులను తమిళనాడు పోలీసులు ఢిల్లీ పోలీసులకు అప్పగించనున్నారు. ఉగ్రవాద సంస్థల నుంచి వీరికి నిధులు సమకూరుతున్నాయని, వీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా ఉగ్ర సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నారని అధికారులు చెప్పారు. వీరిలో కొందరు ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న ఓ బంగ్లాదేశీ హ్యాండ్లర్‌తో సంప్రదింపులు జరిపినట్లు వారు చెప్పారు.
జమ్మూ కశ్మీర్‌లోని కిష్టార్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాల ఎదురు కాల్పులలో జైషే మొహమ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఛత్రూ బెల్ట్‌లోని పాసర్కూట్లో భద్రతా దళాల ట్రాషీ-1 ఆపరేషన్‌లో ఉగ్రవాదులు మరణించినట్లు 2 ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు సైన్యం తెలిపింది.