Justice Yashwant Varma : ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభించిన కేసులో ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్ వర్మ దోషిగా తేలాడు. అతడిపై మోపిన అభియోగాలు అన్నీ నిజమే అని లోక్సభ ప్యానెల్ నిర్ధరించింది. అయితే, ఈ విషయంలో అతడిపై ఏ చర్యలు తీసుకుంటారు అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి, రిటైర్డ్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలోని 30 తుగ్లక్ రోడ్డులోని ప్రభుత్వ భవనాల్లో నివాసం ఉంటున్నాడు. గత ఏడాది మార్చి 14-15 తేదీల మధ్య అతడి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలను ఆర్పేశారు. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో కొన్ని ఫొటోలు బయటపడ్డాయి. సంచలన విషయాలు వెలుగు చూశాయి.
అగ్నిప్రమాదం జరిగిన యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలున్నాయి. ఇంటి స్టోర్ రూమ్లో ఈ నోట్ల కట్టలు చాలా వరకు కాలిపోయాయి. కొన్ని ధ్వంసమయ్యాయి. అవన్నీ రూ.500 నోట్ల కట్టలే. ఈ అంశం వివాదాస్పదం కావడంతో పోలీసులు, ఇతర అధికారులు ఆ ఇంటికి వెళ్లి ఆ ప్రదేశాన్ని సీజ్ చేశారు. అప్పటికే ఇంట్లోని సాక్షాలు తారుమారు అయ్యాయి. ఫొటోల్లో కనిపించిన కరెన్సీ నోట్లు ఆ సమయానికి అక్కడ లేవు. మొదట ఈ నోట్ల కట్టలకు, తనకు సంబంధం లేదని యశ్వంత్ వర్మ చెప్పాడు. అసలు, ఈ నోట్లు తన ఇంటికి సంబంధం లేదని చెప్పాడు. అయితే, ఒక రిటైర్డ్ జడ్జి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కనిపించడం సంచలనంగా మారింది. జడ్జిల అవినీతి అంశం తెరమీదకు వచ్చింది. దీంతో ఈ అంశంపై పెద్ద దుమారం రేగింది. చివరకు దీనిపై పార్లమెంట్ స్పందించింది. ఈ అంశంపై విచారణ జరిపేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్.. ఈ అంశంపై విచారణ జరిపింది.
పలుమార్లు యశ్వంత్ వర్మను ప్రశ్నించింది. అయితే, ఈ విచారణ తర్వాత అతడిని ప్యానెల్ దోషిగా గుర్తించింది. ఇందుకు ప్రధాన కారణాలు ఇవి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. అది ఎవరిది.. ఆ డబ్బు ఎంత ఉంటుంది.. వంటి వివరాలపై యశ్వంత్ వర్మ సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో తనకు తెలియదన్నాడు. ఇతరులు తన ఇంటిని అక్రమంగా వాడుకునే అవకాశం ఉందని, ఎవరో తనకు తెలియకుండా డబ్బు తన ఇంట్లో పెట్టారని వర్మ చెప్పాడు. తనపై కుట్ర చేసి ఎవరో ఆ నోట్లు తన ఇంట్లో పెట్టారని చెప్పాడు. అయితే, ఇందుకు తగ్గ సాక్షాల్ని ఆయన చూపించలేకపోయారు. ఆయన చెప్పిన సమాధానాలు నమ్మలేని విధంగా ఉన్నాయి. విచారణ ప్యానెల్ కూడా ఆ ఇంట్లోకి బయటి వ్యక్తులు వచ్చి, అంత డబ్బు ఉంచినట్లు ఆధారాలు లేవని తేల్చారు. మరోవైపు కాలిపోయిన నోట్లు తర్వాత కనిపించకపోవడంపై కూడా వర్మ సరైన సమాధానం చెప్పలేకపోయారు.
సాధారణంగా ఏదైనా ఘటన జరిగితే.. అక్కడ సాక్షాల్ని అలాగే ఉంచుతారు. కానీ, కరెన్సీ నోట్లు దొరికిన అతడి స్టోర్ రూమ్లో అవేమీ కనిపించలేదు. నోట్లను మాయం చేశారు. వాటి లెక్క కూడా తేలలేదు. సమాధానాలు దాటవేయడం, తప్పించుకోవాలని చూడటం కారణాలతో ఈ అంశంలో యశ్వంత్ వర్మను లోక్సభ ప్యానెల్ దోషిగా తేల్చింది. వర్మ దోషిగా తేలిన నేపథ్యంలో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.