ఓల్లన్న కచ్రపు పొనికెల తెచ్చి
గాల్లింటి ముంగట ఉస్కె జారగొట్టిండ్రా..
అద్దగంటల అంద్రం ఆడనే తేలుతుంటిమి…
మొట్టమొదాలు కస్కెలేరి పక్కకు పెడుతుంటిమి…
గా ఉస్కెల మనిషికోకెయి కూసుండి
పాదం మీద ఉస్కె ఒత్తి
పిట్టగూళ్లు కడుతుంటిమి…
ఇండ్లు గుడి బడి తొవ్వలు తంబాలు
గాడ వాడలే తయారైతుండె…
బొడిగె రవుతులను పొయి రాళ్ల తీర్గ
సొప్పబెండ్లను పొయిల కట్టెల మారెం
బొమ్మ బగోండ్లల్ల ఆడిపిల్లగాండ్లు
అన్నం కూర అండినట్టు
మమ్ముల కూసుండవెట్టి ఆకులేసి అడ్డిత్తుండ్రి…
కడుపు నిండ తిన్నంత తుర్తి అనిపిత్తుండె…
గాడ అంగడి సాగినట్టు
గా ఊర్లెకు బసచ్చినట్టు
ఓకాడ బడి.. ఓకాడ గుడి
గా ఉస్కెల ఊరునే కట్టుకొని
సంబ్రపు మొగులును ముట్టిచ్చుకుంటుంటిమి…
యాప కొమ్మలిరుసుకచ్చి
గా ఉస్కెలున్న ఊర్లే
తొవ్వల పొంట సెట్ల తీర్గ
నాటుతుంటుంటిమి…
గా ఉస్కెల ఆడినంత సేపు
మా పోరగాండ్లం అంద్రం ఇంజినీర్లమే…
గప్పుడు గా ఉస్కెల మేం కట్టిన
ఊరును నిలవడి సూత్తే
గిప్పటి యాదాద్రి లెక్కనే
లవు సక్కదనముంటుండె…
గా పిట్టగూళ్లు కట్టినప్పటి
పట్టరాని సంతోషం
గిప్పుడు ఎన్ని అంత్రాల
బంగ్లా కట్టినా దొర్కుతలేదు…
గందుకే గా ఉస్కెల ఊరు కట్టిన కాలానికి
మల్గి పోవాలనిపిత్తుంది…
అవ్… తిరమైనపుడాల్ల
నేనైతే కండ్లు మూస్కొని
ఒక్క మాల్కన్నా పోయత్త…
మీరు సుతం రాండ్రి..!
-అల్లాడి శ్రీనివాస్
8341663982