వరంగల్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారుకు విధి విధానాల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయో లేదో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను మభ్యపెట్టే కుట్రలకు తెరతీసింది. ఆహారభద్రత కార్డులకు కాంగ్రెస్ రంగులు అద్ది పంపిణీ చేస్తున్నది.ప్రభుత్వం జారీ చేసే కార్డుల స్థానే కాంగ్రెస్ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేసేందుకు సిద్ధపడింది. కాంగ్రెస్ దుశ్చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని గోపనపల్లిలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు మిట్టపల్లి నాగార్జున ఆదివారం నకిలీ ఆహారభద్రతాకార్డులను ముద్రించి పంపిణీ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించారు. ‘తెలంగాణ ప్రభుత్వం, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాలు’ పేరుతో రేషన్‌కార్డులను పోలిన కార్డుల పంపిణీ చేపట్టారు.
పేదలందరికీ సన్నబియ్యం పథకం పేరుతో ముద్రించిన ఈ కార్డుల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఫొటోలతోపాటు గ్రామ అధ్యక్షుడు మిట్టపల్లి నాగార్జున ఫొటోలను ముద్రించి పంపిణీ చేశారు. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే రేషన్ కార్డులపై కాంగ్రెస్ నాయకుల ఫొటో ఏంటి? అని గ్రామస్థులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తం అవుతున్నది. రేషన్‌కార్డుల కలర్ప్రింట్ వెనుకవైపున స్థానిక నాయకుడు అత్యుత్సాహంతో ఫొటోను ప్రింట్చేశారని, తక్షణమే సదరు రేషన్‌కార్డు ప్రతులను స్వాధీనం చేసుకున్నట్టు పర్వతగిరి తహసీల్దార్ వెంకటస్వామి పేర్కొనటం గమనార్హం.
రిజర్వేషన్ ఖరారుపై అనుమానాలు
వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండలంలో సర్పంచ్ రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. మండలంలో 16 గ్రామాలు ఎస్టీలకు, 4 గ్రామాలు ఎస్సీలు, బీసీలకు 3 గ్రామాలు రిజర్వ్‌కాగా, 10 గ్రామాలు జనరల్ స్థానాలుగా తేలాయి. గోపనపల్లి సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. కార్డుల పంపిణీ చేపట్టిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు మిట్టపల్లి నాగార్జున అవివాహితుడు. నాగార్జున తల్లి పోటీచేస్తారా? వారి సంబంధీకులు బరిలో నిలుస్తారా? అనే విషయాలు అటుంచితే రిజర్వేషన్ ఖరారు కాకముందే ఆ స్థానం బీసీకి కేటాయింపు జరుగుతుందని మిట్టపల్లి నాగార్జునకు ఎలా తెలుసు? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోపనపల్లి స్థానం బీసీలకే ఖరారు అవుతుందని నాగార్జునకు ముందే తెలిసిందా? యాదృచ్ఛికంగా జరిగిపోయిందా? అని సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది.