Narketpally | నల్గొండ జిల్లాలో నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో అప్పు వసూలు సందర్భంగా జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన శంభులింగం (60) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పదిర గ్రామానికి చెందిన సూర ఆంజనేయులు, శంభులింగం మధ్య అప్పు విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో శంభులింగం ఛాతి భాగంలో తీవ్రంగా గాయాలయ్యయి. దీంతో శంభులింగంను హుటాహుటిన నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శంభులింగం ప్రాణాలు విడిచాడు.
గతంలోనే పెద్దల సమక్షంలోనే రూ.80వేల అప్పు చెల్లించినప్పటికీ, ఇంకా డబ్బులు వస్తాయని సూర ఆంజనేయులు కొంతకాలంగా గొడవపడుతున్నాడని శంభులింగం కుటుంబసభ్యులు ఆరోపిస్తారు. ఈ క్రమంలో ఇవాళ ఇంటికి వచ్చి దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అధిక వడ్డీతో సూర ఆంజనేయులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని గతంలో ఆయనపై పలు కేసులు ఉన్నాయని సమాచారం.