Puvvada Ajay Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయివేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రయివేటీకరణ యత్నాలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికే వరంగల్ డిపోను జేబీఎం అనే సంస్థకు అప్పజెప్పిందని, సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్‌లోని పలు డిపోలను కూడా ప్రయివేటీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ప్రజా రవాణా నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తుందని, ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకైనా పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రయివేటీకరణ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద గొడ్డలిపెట్టు లాంటి సమస్య. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కార్మికుల పక్షాన గట్టిగా నిలబడి కొట్లాడుతాం అని పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు.
డిజీల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ముసుగులో ఆర్టీసీని ప్రయివేటీకరించే అజెండాతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేది బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్రం ద్వారా ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఫేమ్ 1, 2 అనే స్కీమ్‌ల ద్వారా రాష్ట్రంలో ఈ బస్సులకు సంబంధించి కోటి రూపాయాలు సబ్సిడీ పొంది ఆర్టీసీ ఆధ్వర్యంలో 40 బస్సులు తీసుకున్నాం. ఎలక్ట్రిక్ బస్సులను నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు నడిపాం.
ఏ డిపోను కూడా ప్రయివేటు కంట్రోల్‌కు ఇవ్వలేదు అని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
మేజర్‌గా సిటీలోనే కాలుష్య నియంత్రణ కోసం, నగరం ఇమేజ్ దృష్ట్యా ఇక్కడే ఎలక్ట్రిక్ బస్సులను నడిపాం. ఆర్టీసీకి ఓనర్షిప్ ఉండే విధంగా సొంతంగా 650 డిజీల్ బస్సులు కొన్నాం. ఒక వైపు సంస్థను బలోపేతం చేసుకుంటూనే.. కార్గో పార్శిల్ సర్వీసులు లాంటివి పెట్టి నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నం చేశాం. ప్రభుత్వం మారింది.. కాంగ్రెస్ పార్టీ చేసిన 420 హామీల్లో ఆర్టీసీకి సంబంధించిన అనేక హామీలు ఉన్నాయి. విలీన ప్రక్రియకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. విలీన ప్రక్రియ కూడా పూర్తి చేశాం. ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయిపోయింది. విలీన ప్రక్రియను తాత్సారం చేస్తున్నారు. ఆర్టీసీలో 3035 ఉద్యోగాల పేరుతో అనేక ప్రకటనలు ఇచ్చినప్పటికీ అటకెక్కించారు. ఆర్టీసీ డిపోలను ప్రయివేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తున్నారు. వరంగల్ డిపో ద్వారా స్టార్ట్ చేశారు. జేబీఎం అనే సంస్థకు 500 ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చి.. హైదరాబాద్ డిపోలతో పాటు, నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ డిపోను పూర్తిగా వాళ్లకు ధారాదత్తం చేసి.. ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ప్రయివేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Telangana | సీఎం విదేశీ టూర్లు, పక్క రాష్ట్రాల్లో మంత్రులు.. కుక్కలు చింపిన విస్తరిలా రాష్ట్రం