Allu Sirish | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే. అల్లు శిరీష్ పెళ్లి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి రామ్ చరణ్ హాజరయ్యారు. అయితే ఆ సమయంలో ఆయన అయ్యప్ప స్వామి మాలలో ఉండటంతో కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో నెట్టింట కొందరు విమర్శలు గుప్పించారు. “స్వామి మాలలో ఉండి పార్టీకి ఎలా వెళ్తారు?”, “ఇది మాలను అవమానించడమే” అంటూ పలువురు నెగిటివ్ కామెంట్లు చేశారు. ఈ ట్రోలింగ్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఈ విమర్శలకు తాజాగా అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన, ఒక నెటిజన్ చేసిన కామెంట్‌కు సమాధానంగా వివరించారు. రామ్ చరణ్ ఆ పార్టీకి చాలా ముందుగానే వచ్చారని, ఆ సమయంలో అసలు పార్టీ ప్రారంభం కాలేదని తెలిపారు. ఎవరూ ఆల్కహాల్ తీసుకోలేదని, కేవలం ఆయన వచ్చి శుభాకాంక్షలు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. అయ్యప్ప స్వామి మాల పట్ల రామ్ చరణ్‌కు ఎంతటి భక్తి, శ్రద్ధలున్నాయో తనకు తెలుసని శిరీష్ పేర్కొన్నారు. శిరీష్ ఇచ్చిన ఈ వివరణతో సోషల్ మీడియాలో రామ్ చరణ్‌పై వచ్చిన నెగిటివ్ కామెంట్లకు కొంతవరకు చెక్ పడినట్టైంది.
అయ్యప్ప స్వామి మాల విషయంలో రామ్ చరణ్ చాలా క్రమశిక్షణగా ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సంవత్సరంలో కనీసం వంద రోజులు మాలలో కనిపిస్తారని, ఇది తనకు మానసిక దృఢత్వం, వ్యక్తిగత నియంత్రణ కోసం ఉపయోగపడుతుందని గతంలోనే చరణ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక సినిమాల పరంగా చూస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సనాతో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది.