Mohanlal | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుటుంబం నుంచి మరో వారసురాలు సినీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే స్టార్ హీరోల కుమారులు, కుమార్తెలు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో, ఇప్పుడు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన తొలి చిత్రం ‘తుడక్కం’ (Thudakkam) ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు చిత్రబృందం విడుదల చేసిన అధికారిక ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. యాక్షన్, భావోద్వేగాలు, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
‘తుడక్కం’ ఒక భావోద్వేగభరితమైన యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. తండ్రి, కూతురు మధ్య ఉండే సంక్లిష్టమైన బంధాన్ని ప్రధాన కథాంశంగా తీసుకుని దర్శకుడు కథను ఆసక్తికరంగా మలిచినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మంచిగా చదువుకోమని నీకు ఎంతకాలం నుంచి చెబుతున్నాను… ప్రియను చూడు, ఆమె రాసే ప్రతి పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధిస్తుంది అనే డైలాగ్‌తో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలోని భావోద్వేగాలను ఆవిష్కరించారు. అయితే ఆ తర్వాత కథ పూర్తిగా థ్రిల్లర్ మోడ్‌లోకి మారుతుంది. “నాన్న… ఆరోజు జరిగినదంతా మర్చిపోండి. అది ఒక పొరపాటు అంతే. మళ్లీ అలా జరగదు”, “నీ నోరు అదుపులో పెట్టుకో… లేదంటే కష్టాలు మీ ఇంటి తలుపు తడతాయి” వంటి డైలాగ్‌లు సినిమాలో ఉత్కంఠభరితమైన మలుపులు ఉండబోతున్నాయని సూచిస్తున్నాయి.
ట్రైలర్ చివర్లో మోహన్‌లాల్ పవర్ఫుల్ లుక్‌లో అతిథి పాత్రలో కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆయన స్క్రీన్‌పై కనిపించిన కొద్ది క్షణాలే సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. తన కుమార్తె తొలి చిత్రానికి మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించడం అభిమానులకు మరో స్పెషల్ ట్రీట్‌గా భావిస్తున్నారు. విస్మయ మోహన్‌లాల్‌కు కళారంగం కొత్త కాదు. గతంలో గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్( Grains of Stardust) పేరుతో కవితల పుస్తకాన్ని విడుదల చేసి రచయిత్రిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో హీరోయిన్గా సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ ప్రముఖ దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్. కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ‘2018’ చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఆయన ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.