ఆసియా గేమ్స్‌లో భారత కబడ్డీ జట్లు పసిడి కూత పెట్టాయి. పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలు నిలబెట్టుకొని ఈ ఆటలో తమకు ఎదురేలేదని మరోసారి చాటి చెప్పాయి. షూటింగ్లో పతక జోరును కొనసాగిస్తూ మహిళల 50 మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ జట్టు రజతం అందుకుంది. అథ్లెటిక్స్‌లో తజీందర్ పాల్ సింగ్ వరుసగా రెండు ఎడిషన్లలో గెలిచిన పసిడిని నిలబెట్టుకోలేకపోయినా వెండి పతకంతో మెరిస్తే.. ప్రాచి చౌదరి కంచు మోత మోగించింది. స్కాష్‌లో జోష్న చిన్నప్ప-సెంథిల్ కుమార్ కాంస్య పతకం రాబట్టగా.. యువ సంచలనాలు అనాహత్ సింగ్, అభయ్ సింగ్ ఫైనల్ చేరి స్వర్ణాలకు అడుగు దూరంలో నిలిచారు. అసలేమాత్రం అంచనాలే లేని మారథన్‌లో ఆర్మీ అథ్లెట్ సావన్ బర్వాల నెగ్గిన రజతం శనివారం భారత్ నెగ్గిన ఏడు పతకాల్లో అనూహ్య ఫలితం!
నగోయా (జపాన్): భారత కబడ్డీ జట్లు ఆసియా క్రీడల్లో తొడగొట్టాయి. పురుషుల, మహిళల జట్లు అంచనాలను అందుకుంటూ స్వర్ణ పతకాలు గెలిచి మరోసారి గోల్డెన్ డబుల్ సాధించాయి. ఫైనల్లో ఇరు జట్లూ ఇరాన్‌ను ఓడించి చాంపియన్లుగా నిలిచాయి. శనివారం ఉత్కంఠగా జరిగిన పురుషుల ఫైనల్లో భారత్ 40-34తో ఇరాన్‌పై గెలిచింది. తొలుత మహిళల జట్టు 37-34తో ఇరాన్ అమ్మాయిలపై విజయం సాధించింది. ఆసియాడ్‌లో అబ్బాయిలకు ఇది తొమ్మిదో స్వర్ణం కాగా.. అమ్మాయిలు వరుసగా నాలుగో పసిడి పతకం. ఫైనల్లో విజయం సాధించిన తర్వాత భారత క్రీడాకారులు వందేమాతర నినాదాల నడుమ విజయోత్సవ పరేడ్ నిర్వహించారు.
పురుషుల ఫైనల్లో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు పవన్ సెహ్రావత్ బరిలోకి దిగాల్సిన అవసరం లేకుండానే భారత్ విజయాన్ని అందుకోవడం విశేషం. హోరాహోరీగా సాగిన ప్రథమార్థంలో ఇరాన్ అత్యంత దూకుడుగా ఆడి 18-17తో ఆధిక్యంలో నిలిచింది. అయితే విరామం తర్వాత భారత మేనేజ్మెంట్ పక్కా వ్యూహాన్ని అమలు చేసింది. టచ్ పాయింట్లు తెచ్చే రైడర్లు అర్జున్ దేశ్వాల్, దేవాంక్‌ను మాత్రమే దాడులకు పంపగా, వారు మ్యాచ్‌ను మలుపుతిప్పేశారు. అదే సమయంలో ప్రారంభంలో రైడింగ్‌లో తడబడిన అస్లాం ముస్తఫాను డిఫెన్స్‌కు పంపి రక్షణ గోడను బలపరిచారు. ఈ వ్యూహంతో భారత్.. ఇరాన్‌ను ఆలౌట్ చేసి 29-24 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత నెమ్మదిగా, వ్యూహాత్మకంగా సమయం గడుపుతూ ఆడి ఇరాన్ ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

మహిళల ఫైనల్లోనూ భారత్ వ్యూహాత్మక ప్రదర్శన చేసింది. గ్రూప్ దశలోనే గుర్తించిన ఇరాన్ లెఫ్ట్ ఫ్లాంక్ బలహీనతను ఆసరాగా చేసుకుని రైడర్లు నికిత, కెప్టెన్ పూజ, సంజూ దేవి విరుచుకుపడ్డారు. ప్రథమార్థంలో ఓ ఆలౌట్ సాధించిన భారత్ 22-16తో ముందంజ వేసింది. ద్వితీయార్థంలో ఇరాన్ ప్లేయర్లు వేగంగా పాయింట్లు సాధించి భారత జట్టును ఆలౌట్ చేసి 27-28తో ఆధిక్యాన్నితగ్గించారు. నికిత స్వల్పంగా గాయపడినా తిరిగి మ్యాట్‌పైకి వచ్చి పోరాడగా.. చివర్లో ఒత్తిడికి లోనుకాకుండా పటిష్టమైన డిఫెన్స్‌తో సత్తా చాటిన భారత్ విజయం అందుకంది.
పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పూల్-ఎ చివరి పోరులో భారత్ 2-0తో ఆతిథ్య జపాన్ను చిత్తు చేసింది. 15వ నిమిషంలో అభిషేక్, 40వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ చెరో గోల్ కొట్టారు. వరుసగా నాలుగో విజయంతో గ్రూప్‌లో అగ్రస్థానంతో సెమీస్ బెర్తును దక్కించుకుంది. బాక్సింగ్‌లో కపిల్ పోఖరియా (90 కేజీ), ప్రియ ఘంగాస్ (60 కేజీ) క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టగా, జాదుమణి సింగ్ (55 కేజీ) టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
ఆర్చరీ క్వాలిఫికేషన్ రౌండ్ల లో తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత, ఏపీ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ అదరగొట్టారు. ప్రపంచ 4వ ర్యాంకర్ ధీరజ్ రికర్వ్ వ్యక్తిగత క్వాలిఫికేషన్లో 720 పాయింట్లకు గాను ఏకంగా 698 పాయింట్లు సాధించి కొత్త ఆసియా క్రీడల రికార్డును నెలకొల్పాడు. ధీరజ్ – కుంకుమ్ మొహోద్ జోడీ రికర్వ్ మిక్స్డ్ టీమ్‌లో 1364 పాయింట్లతో రెండో సీడింగ్ దక్కించుకుంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత క్వాలిఫికేషన్లో చికిత 705 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ 13వ స్థానంలో నిలిచి ఎలిమినేషన్ రౌండ్‌కు అర్హత సాధించింది. ఆదివారం నుంచి మెయిన్ రౌండ్ పోటీలు జరుగుతాయి.

భారత స్టార్ అథ్లెట్ తజీందర్‌పాల్ సింగ్ తూర్ షాట్‌పుట్ విభాగంలో రజతం సాధించాడు. ఫైనల్లో గుండును 20.64 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. ఆసియాడ్‌లో తూర్కు ఇది మూడో పతకం. గత రెండు ఎడిషన్లలో స్వర్ణ పతకాలను గెలుచుకున్న అతను ఈసారి పసిడి అందుకోలేకపోయాడు. ఇక మహిళల 400 మీటర్ల పరుగులో ప్రాచి చౌదరి కాంస పతకం గెలిచింది. ఫైనల్ రేసును ప్రాచి 53 నిమిషాల 21 సెకండ్లతో మూడో స్థానంతో ముగించింది.

బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, ఉన్నతి హుడా, పాటు డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ క్వార్టర్స్ చేరారు. ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-9, 21-13తో మియాజకి (జపాన్)ను ఓడించగా, ఉన్నతి 21-19, 21-13తో ఆరో ర్యాంకర్ పుత్రి కుసుమ (ఇండోనేసియా)కు షాకిచ్చింది. డబుల్స్‌లో గాయత్రి ద్వయం 24-22, 21-18తో యుకి ఫుకుషిమా- మత్సుమొటో (జపాన్)ను ఓడించింది. కానీ, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌తో పాటు ఆయుష్ షెట్టి పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక, టేబుల్ టెన్నిస్ పురుషుల, మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మనుష్ షా, యశస్విని ఓటమి పాలయ్యారు.

ఆసియాడ్ మారథాన్‌లో భారత్‌కు అనూహ్య పతకం దక్కింది పురుషుల మారథాన్ (42.195 కిలోమీటర్లు) రేసులో భారత ఆర్మీకి చెందిన సావన్ బర్వాల్ సంచలన ప్రదర్శనతో రజతం గెలిచాడు.2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో రేసును పూర్తి చేసిన సావన్, తన పేరిట ఉన్న జాతీయ రికార్డును తానే బద్దలు కొట్టాడు. మారథాన్‌లో భారత్ పతకం నెగ్గడం 44 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. 1982 న్యూఢిల్లీ ఆసియాడ్‌లో హోసూర్ సీతారామ్ కాంస్యం సాధించాడు. ఆసియాడ్ చరిత్రలో మారథాన్ పతకం సాధించిన భారత నాలుగో అథ్లెట్‌గా సావన్ నిలిచాడు. 1951 లో ఛోటా సింగ్ (స్వర్ణం), సూరత్ సింగ్ (కాంస్యం) పతకాలు సాధించారు.

స్క్వాష్ పోటీల్లో అనాహత్ సింగ్, అభయ్ సింగ్ ఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణాలతో పాటు 2028 ఒలింపిక్స్ అర్హతకు అడుగు దూరంలో నిలిచారు. మిక్స్డ్ డబుల్స్‌లో జోష్న చిన్నప్ప- సెంథిల్ కుమార్ కాంస్యం గెలిచారు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 18 ఏండ్ల అనాహత్ 3-2తో ప్రపంచ 6వ ర్యాంకర్ వతనాబే (జపాన్)ను ఓడించింది. పురుషుల్లో అభయ్ 3-0తో పాకిస్థాన్ ఆటగాడు మహమ్మద్ ఇర్ఫాన్‌ను చిత్తు చేశాడు. మిక్స్డ్ సెమీఫైనల్లో జోష్న – సెంథిల్ జంట 1-2తో మింగ్ హాంగ్ – లీ కా యీ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడి కాంస్య పతకంతో సంతృప్తి చెందింది. 40 ఏండ్ల చిన్నప్పకు ఆసియాడ్చరిత్రలో ఇది ఆరో పతకం.

షూటింగ్ రేంజ్లో భారత్ మళ్లీ మెరిసింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ విభాగంలో తిలోత్తమ సేన్, విదర్స వినోద్, ఆషి చౌక్సీతో కూడిన జట్టు రజత పతకాన్ని సాధించింది. ఫైనల్లో భారత త్రయం మొత్తం 1763 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. చైనా 1773 పాయింట్లతో స్వర్ణం కైవసం చేసుకుంది. వ్యక్తిగత ఫైనల్లో 18 ఏండ్ల తిలోత్తమ 337.3 పాయింట్లతో 4వస్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయింది.