చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్ నిర్వాకానికి నిదర్శనమీ ఉదంతం! ఇందిరమ్మ ఇల్లు పేరిట ప్రభుత్వం చేసిన దగాతో వృద్ధ దంపతులు నిలువ నీడ కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఆశపెట్టిన సర్కార్ ఊరిలోనే ఆర్భాటంగా సభపెట్టి మంజూరు పత్రం అందించింది. సర్పంచ్‌తో ఇంటి నిర్మాణానికి భూమి పూజ కూడా చేయించింది. కొత్తింటి సంతోషంలో శిథిలావస్థకు చేరిన పాత ఇంటిని ఆ దంపతులు కూల్చివేశారు. తీరా ఇప్పుడు ఇల్లే మంజూరు కాలేదని అధికారులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 26 : ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని వృద్ధ దంపతులకు ఓ వైపు ఎమ్మెల్యే మంజూరు పత్రం ఇచ్చారు.. మరోవైపు సర్పంచ్ ఆ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు.. సొంతింటి కల నెరవేరుతుందనుకుంటున్న తరుణంలో అధికారులు ఇల్లు మంజూరు కాలేదని చెప్పి వారి ఆశలను అడియాశలు చేశారు. ఈ దయనీయ స్థితి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో నెలకొన్నది. వివరాల్లోకి వెళ్తే.. ఇప్పగూడెంకు చెందిన కొలిపాక వెంకటయ్య, వెంకటమ్మ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. జీవనోపాధికోసం హైదరాబాద్‌కు వెళ్లిన కొడుకు నాలుగేండ్ల క్రితం మృతిచెందాడు. కోడలు రేణుక ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటూ కూలి పనులు చేస్తున్నది. వెంకటయ్య, వెంకటమ్మ రజక వృత్తి చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.
పెంకుటిల్లు శిథిలావస్థకు చేరడంతో ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు. జూన్‌లో సర్పంచ్, అధికారుల సమక్షంలో ఇప్పగూడెంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొలిపాక వెంకటమ్మ పేరున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ ధ్రువీకరణపత్రం అందించారు. ఇల్లు మంజూరైందనే సంతోషంలో శిథిలావస్థకు చేరిన పాతఇంటిని వీరు కూల్చేశారు. కొత్త ఇంటి నిర్మాణానికి ఖాళీ స్థలంలో సర్పంచ్ మందపురం రాణి అనిల్‌తో భూమిపూజ చేయించారు.
తీరా పనులు ప్రారంభించే సమయానికి అధికారులు వచ్చి ఇల్లు మంజూరు కాలేదని చెప్పడంతో ఆ దంపతులు దికుతోచని స్థితిలో పడిపోయారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్న ఆశతో ఉన్న పాత ఇంటిని కూలగొట్టుకోవడంతో నిలువ నీడలేక వృద్ధ దంపతులు తమ బంధువుల ఇంటి ముందున్న రేకులషెడ్డులో అద్దెకు ఉంటూ.. వానకు తడుస్తూ చలికి వణుకుతూ జీవనం సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రంలో ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
గ్రామానికి మొత్తం 100 ఇండ్లు వచ్చాయి. ఇందులో 10 వరకు అప్రూవల్ కాలేదు. కొలిపాక వెంకటమ్మ కుటుంబంతోపాటు మరో మూడు కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయి. వీరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరగా స్పందించిన ఆయన వెంకటమ్మకు ఇల్లు మంజూరు పత్రం అందించారు. ఆన్లైన్లో వీరి ఫొటో అప్లోడ్ చేయడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. నెల రోజుల్లోగా సమస్యను పరిష్కరించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తాం.
– మందపురం రాణిఅనిల్, ఇప్పగూడెం సర్పంచ్