Bloody Romeo | న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు వరుసగా ట్రీట్స్ అందుతున్నాయి. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ అప్డేట్తో జోష్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు, ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న నాని 32వ చిత్రం ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) అనౌన్స్మెంట్ వీడియో మరో కిక్కు ఇస్తోంది. గతంలోనే ప్రకటించిన ఈ ప్రాజెక్ట్, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, తాజాగా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను నాని బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. ‘ఓజీ’ (OG) తర్వాత సుజీత్ చేస్తున్న సినిమా కావడం, నాని వంటి పెర్ఫార్మర్తో జతకట్టడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ సినిమా ‘ఓజీ’ యూనివర్స్‌లో భాగం కాదని, కానీ సుజీత్ తొలి చిత్రం ‘రన్ రాజా రన్’ తరహాలో అత్యంత స్టైలిష్ యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్‌తో కూడిన డార్క్ క్రైమ్ కామెడీగా ఉండబోతోందని సమాచారం. ఇందులో నాని చెఫ్ పాత్రలో కనిపిస్తూ.. గ్యాంగ్‌స్టర్‌గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్గా త్రిప్తి డిమ్రి లేదా పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాల్సి ఉండగా, ఇప్పుడు అది నిహారిక ఎంటర్టైన్మెంట్స్ (వెంకట్ బోయనపల్లి) మరియు నాని సొంత బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ చేతుల్లోకి మారింది.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభించి, 2026 డిసెంబర్ (క్రిస్మస్) కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.