Manipur Crisis | మణిపురి చిత్రం ‘బూంగ్’ (Boong) ప్రతిష్టాత్మకమైన బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (BAFTA) 2026 అవార్డును గెలుచుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మణిపురి భాషలో తెరకెక్కిన ‘బూంగ్’ చిత్రం ప్రతిష్టాత్మకమైన బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) 2026 అవార్డుల్లో సత్తా చాటింది. ఈ చిత్రం ‘బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్’ కేటగిరీలో విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. “ఇది దేశానికే గర్వకారణం.. ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రానికి ఇది ఎంతో సంతోషాన్నిచ్చే సమయం” అని పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ మణిపూర్ పేరు ఎత్తుతూ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మణిపూర్‌లో గత మూడేళ్లుగా సాగుతున్న హింసాకాండలో 260 మందికి పైగా మరణించగా.. 60,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికీ నిరాశ్రయులుగానే ఉన్నారు. చర్చిలు, టెంపుల్స్ దగ్ధమై, సమాజం రెండు వర్గాలుగా విడిపోయి భయానక వాతావరణం నెలకొంది. అయితే బూంగ్ సినిమాకు అవార్డు అందుకున్న సందర్భంగా ఈ చిత్ర దర్శకురాలు లక్ష్మీప్రియ దేవి మాట్లాడుతూ.. ‘మణిపూర్ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. భారతదేశం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. రాష్ట్రంలో శాంతి తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ అంటూ వేదికపైనే తన ఆవేదన వ్యక్తం చేసింది.
ఒకవైపు రాష్ట్రం అట్టుడుకుతుంటే పట్టించుకోని ప్రధాని.. ఇప్పుడు ఒక అవార్డు రాగానే “మణిపూర్‌కు ఎంతో సంతోషం” అని చెప్పడం బాధ్యతారాహిత్యమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇది సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమేనని సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు ప్రధాని పోస్ట్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ఓ మై గాడ్.. ఇప్పటికైన సంతోషం.. మణిపూర్ ఇండియాలోనే ఉంది అని తెలుసుకున్నావంటూ ప్రకాశ్ రాజ్ విమర్శించాడు.