సినిమా పేరు: ‘బైకర్’
తారాగణం: శర్వానంద్, డా.రాజశేఖర్, మాళవిక నాయర్, అతుల్ కులకర్ణి..
దర్శకత్వం: అభిలాష్‌రెడ్డి
డీవోపీ: జె.యువరాజ్
సంగీతం: జిబ్రాన్
నిర్మాతలు: వంశీ ప్రమోద్
నిర్మాణం: యూవీ క్రియేషన్స్
‘నారీ నారీ నడుమ మురారి’ వంటి విజయం తర్వాత శర్వానంద్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘బైకర్’పై ఆడియన్స్‌లో అంచనాలు బాగా ఏర్పడ్డాయి. డా.రాజశేఖర్ భాగం కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ఓ కారణం. ‘బైకర్’లోని పాత్ర కోసం శర్వానంద్ ఓ స్థాయిలో మేకోవర్ అయ్యారు. ఓ స్పోర్ట్స్ మ్యాన్‌గా కనిపించేందుకు ఆయన చూపించిన కష్టం అసామాన్యం. అలాగే రేసర్‌గా నటించేందుకు రేసింగ్‌లో కూడా శిక్షణ తీసుకున్నారు శర్వా. ఈ క్రమంలో విడుదలైన శర్వా ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. పైగా రాజీ అనే పదమే తెలియని యూవీ క్రియేషన్స్వారి సినిమా. ఇన్ని ప్రత్యేకతలతో శుక్రవారం ‘బైకర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అనుకున్నట్టు అందరి అంచనాలనూ ‘బైకర్’ నిజం చేసిందా? అనే విషయం తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం
కథ
సునీల్ నారాయణ(డా.రాజశేఖర్) గొప్ప బైకర్. బైక్ రేసింగ్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడం అతని లక్ష్యం. తను వయసులో ఉన్నప్పుడు సాధించలేని ఆ లక్ష్యాన్ని కొడుకు విక్కీ(శర్వానంద్) ద్వారా తీర్చుకోవాలని తపిస్తుంటాడు. కొడుకు కోసం కోచ్‌గా మారతాడు. నిజానికి విక్కీ కూడా రేసింగ్‌లో తండ్రికి ఏ మాత్రం తీసిపోడు. తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు విక్కీ కూడా ఎంతో కష్టపడి దేశం మాట్లాడుకునే గొప్ప రేసర్‌గా ఎదుగుతాడు. ఇదిలావుంటే.. మరోపక్క అనన్య(మాళవిక నాయర్)తో విక్కీ ప్రేమలో ఉంటాడు. రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకుంటాడు. ఈ క్రమంలో అనన్య గర్భం దాలుస్తుంది. విక్కీని ఛాంపియన్‌గా చూడాలనుకునే సునీల్ నారాయణ ఆశకు విక్కీ ప్రేమ, పెళ్లి అడ్డంకిగా మారతాయి. ఒకానొక దశలో ప్రేమ కోసం రేసింగ్‌ని కూడా పక్కన పెట్టేస్తాడు విక్కీ. తండ్రి సునీల్ నారాయణకు దూరంగా భార్య అనన్యతో ప్రశాంతంగా జీవితం గడుపుతుంటాడు. వారిద్దరికీ ఓ బాబు కూడా పుడతాడు. రేసింగ్‌కి విక్కీ దూరం కావడంతో అతన్ని స్పాన్సర్ చేసిన బిగ్‌షాట్(అతుల్ కులకర్ణి).. విక్కీ తండ్రి సునీల్‌పై మోసగాడు అనే ముద్ర వేస్తాడు. తండ్రిపై నింద పడటంతో తండ్రిని అమితంగా ప్రేమించే విక్కీ మళ్లీ రేసింగ్ మొదలుపెడతాడు. దీనికోసం తన కుటుంబానికి కూడా దూరమవుతాడు. మరి ఇంతకీ విక్కీ తండ్రిపై పడిన నిందను చెరపగలిగాడా? తండ్రి కోసం మొదలుపెట్టిన రేసింగ్‌లో విజయం సాధించాడా? తన భార్య, బిడ్డలతో విక్కీ మళ్లీ ఎలా కలిశాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.
విశ్లేషణ
స్పోర్ట్స్ డ్రామాలో కొత్త లైనంటూ ఉండదు. తాను ఎంచుకున్న క్రీడలో ప్రధానపాత్రధారి ఎలా నెగ్గాడు? అనేదే సినిమా. దాన్ని భావోద్వేగపూరితమైన మంచి కథనంతో ఉత్కంఠభరితంగా చూపించగలిగితే సినిమా హిట్. నాటి ‘అశ్వని’ నుంచి నిన్నమొన్నటి వెంకటేశ్ ‘గురు’ వరకూ ఇదే లైన్. బాలీవుడ్లో ‘దంగల్’లో జరిగింది కూడా ఇంచుమించూ ఇదే. ఈ గెలిచే పరిణామక్రమంలో ప్రధానపాత్రధారి పడే అంతర్మథనం, మానసిక వేదన, ఆటుపోట్లూ.. ఇవన్నీ ఆడియన్ కూడా అనుభవించాలి. హీరో గెలుపు తన గెలుపనుకోవాలి. ఇలా తీయగలిగితే సినిమా హిట్. లేకపోతే ఫట్. ఈ విషయం ‘బైకర్’ దర్శకుడు అభిలాష్‌రెడ్డి కొంతమేరకు సక్సెస్ అయ్యాడు. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాల్లో హీరో ఎంత సంఘర్షణకు గురైతే సినిమా అంత బలంగా జనాల్లోకి వెళ్తుంది. కానీ ఈ సినిమాలో హీరో పాత్రలో ఆ స్థాయి సంఘర్షణ కనిపించదు. కాకపోతే శర్వానంద్ పాత్రను చాలా ైస్టెలిష్‌గా మలిచాడు. హీరోహీరోయిన్ల ప్రేమకథ కూడా బావుంది. ‘దంగల్’లో అమీర్‌ఖాన్, ‘అశ్విని’లో భానుచందర్, ‘గురు’లో వెంకటేశ్ పోషించినటువంటి పాత్రనే ఇందులో డా.రాజశేఖర్ పోషించారు. కానీ అమీర్, భానుచందర్, వెంకటేశ్ పాత్రల్లో ఉండేంత మానసిక సంఘర్షణ రాజశేఖర్ పాత్రలో మనకు కనిపించదు. కానీ ఆయన పాత్రను కూడా ైస్టెలిష్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇది మూడు కాలాల్లో జరిగే కథ. దాంతో స్క్రీన్‌ప్లే వెనుక నుంచి ముందుకు, ముందు నుంచి వెనక్కీ నడిపిన తీరును, సినీ మేకింగ్‌పై కాస్తోకూస్తో అవగాహన ఉన్న వాళ్లు మాత్రమే అర్థం చేసుకోగలరు. సాధారణ ప్రేక్షకుడు మాత్రం కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే.. సినిమాలో ఎక్కడా వేస్ట్ సీన్ గానీ, వేస్ట్ షాట్ కానీ ఉండదు. కాన్సన్ట్రేషన్ అంతా కథ నడిపించడం పైనే ఉంచాడు దర్శకుడు. అయితే.. నేరేషన్ కాస్తంత స్లో అవ్వడం ఇబ్బంది కలిగించే అంశం.
నటీనటులు
శర్వానంద్ ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. అభినయపరంగా చాలా పరిణతి కనపరిచాడు. రేసర్‌గా, కొడుకుగా, లవర్‌గా, తండ్రిగా ఇలా చాలా కోణాల్లో ఆయన పాత్ర సాగుతుంది. ప్రతికోణాన్ని సమర్థవంతంగా నడిపించాడు. అలాగే యాక్షన్ మోడ్‌లో ఇరగదీశాడు కూడా. నిజంగా ఓ కొత్త శర్వానంద్‌ని ఇందులో చూస్తారు. ఇక రాజశేఖర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిందేం లేదు. చేయించుకోనే దర్శకుడిలో సత్తా ఉండేలాకానీ.. ఆయన్నుంచి ఎంతైనా పిండుకోవచ్చు. దర్శకుడు ఆయన పాత్రపై ఇంకాస్త శ్రద్ధ పెడితే సినిమా మరోస్థాయిలో ఉండేది. ఉన్నంతలో తన పాత్రకు వందకు వందశాతం న్యాయం చేశారు రాజశేఖర్. ఇక హీరోయిన్ మాళవిక నాయర్‌ది ఇందులో చాలా కీలకమైన పాత్ర. నిజంగా సినిమాలో ఆమె స్క్రీన్ ప్రెజన్స్ అద్భుతం. తాను పోషించిన అనన్య పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. ఇక అతుల్‌కులకర్ణి దగ్గర నుంచి మిగతా వారంతా తమ పాత్రలకు పరిథిమేర రక్తికట్టించారు.
సాంకేతికంగా
దర్శకుడు కథను, కథనాన్ని ఇంకాస్త గ్రిప్పింగ్‌గా రాసుకుంటే బావుంటేది అనిపించింది. పాత లైన్ కాబట్టి కొత్తగా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి.. అందుకే ఇలాంటి కథపై మరింత శ్రద్ధ పెట్టాలి. కానీ అనుకున్న కథను బాగా తీశాడు. టేకింగ్ ైస్టెలిష్‌గా బావుంది. క్యారక్టరైజేషన్స్ డిజైన్ చేసిన తీరు హర్షణీయంగా ఉంది. ఇక కెమెరా వర్క్ సూపర్. నేపథ్య సంగీతం బావుంది. ఎడిటింగ్ విషయంలో కాస్తంత జాగ్రత్త పడితే బావుండేది. మొత్తంగా మొత్తంగా సినిమా మాత్రం తప్పకుండా మంచి సినిమా. కుటుంబసమేతంగా చూడదగ్గర సినిమా.
బలాలు
నటీనటుల నటన, కెమెరా, నేపథ్య సంగీతం, డైరెక్టర్ ైస్టెలిష్ మేకింగ్..
బలహీనతలు
బలహీనమైన కథనం, స్లో నేరేషన్
రేటింగ్ : 2.75/5