Bala Krishna | నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్లో గోల్డెన్ ఫేజ్‌ను ఆస్వాదిస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఎనర్జీని రెట్టింపు చేస్తూ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హిట్ చిత్రాలతో తన రేంజ్‌ను మరింత పెంచుకున్నారు. ఇప్పుడు బాలయ్య తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకవైపు మాస్ డైరెక్టర్లతో కమర్షియల్ ఎంటర్టైనర్లను కొనసాగిస్తూనే, మరోవైపు యువ దర్శకులకు అవకాశమిస్తూ కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఆయన తన 109వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, డింపుల్ హయతి కీలక పాత్రలో కనిపించనుందని టాక్. ఈ చిత్రాన్ని దసరా లేదా దీపావళి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆలస్యం అయితే 2027 సంక్రాంతి బరిలో విడుదల చేసే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే, తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ బాలయ్య ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఒక పవర్ఫుల్ పోలీస్ కథ తెరకెక్కనుందని సమాచారం. నాంది చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్, ఇప్పటికే బాలయ్యకు కథ వినిపించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గతంలో పోలీస్ పాత్రల్లో బాలయ్య చేసిన సినిమాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విజయ్ కనకమేడల మార్క్ ఇంటెన్స్ డ్రామాతో కూడిన పోలీస్ కథలో బాలయ్యను చూడటం అభిమానులకు కనువిందుగా మారనుంది. పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘కురుక్షేత్రం’ (వర్కింగ్ టైటిల్) అనే ప్రాజెక్ట్ కూడా చర్చల్లో ఉంది. టైటిల్‌ను బట్టి ఇది మాస్ యాక్షన్ సినిమా లేదా పౌరాణిక టచ్ ఉన్న కథనా అనే ఆసక్తి నెలకొంది. పౌరాణిక, చారిత్రక పాత్రల్లో బాలయ్యకు ఉన్న అనుభవం దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. భద్రాచలం ప్రాంతానికి చెందిన విజయ్ కనకమేడల సినీ పరిశ్రమపై ఆసక్తితో హైదరాబాద్ చేరుకుని తన కెరీర్‌ను నిర్మించుకున్నారు. హరీష్ శంకర్ వద్ద ‘షాక్’ నుంచి ‘డీజే’ వరకు పనిచేసి అనుభవం సంపాదించిన ఆయన, ‘నాంది’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ‘ఉగ్రం’, ‘భైరవం’ వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులను కూడా అలరించారు. ఇప్పుడు బాలయ్యలాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం రావడం ఆయన కెరీర్లో మైలురాయిగా నిలవనుంది.