Harish Rao | ఖమ్మం : ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామ రైతు ప్రభాకర్ చనిపోయినప్పుడు రావాలని అనుకున్నాను, ఆరోజు రాలేకపోయాను. అందుకే ఈరోజు వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పుల్లయ్యకు గుండె నిండా ధైర్యాన్ని ఇవ్వడానికి, ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గ్రామానికి రావడం జరిగింది. రైతు ప్రభాకర్ భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తే ఆ దురాగతాలకు ప్రాణాలు విడిచిన ప్రభాకర్ కుటుంబాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఈ ఆత్మహత్య ముమ్మాటికి కాంగ్రెస్ చేసిన హత్య. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క తన నియోజకవర్గంలో విద్యుత్ షాక్‌తో మరణించిన రైతుకి న్యాయం చేయమని అడుగుతే తప్పా? కరెంట్ షాక్‌తో మరణించిన ప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలని పుల్లయ్య అడిగితే వారిపై కేసు పెట్టారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఆరు గ్యారెంటీలతోపాటు ఏడవ గ్యారంటీ ప్రజాస్వామిక పాలన అని ఊదరగొట్టిన కాంగ్రెస్ ఎందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ అరెస్టు చేస్తారు. చనిపోయిన రైతుకు న్యాయం చేయాలని అడిగిన పుల్లయ్యను కేసు పెట్టి అరెస్టు చేస్తారా? పోలీసులకు కూడా నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ఉత్సాహం చూపిన పోలీసులకు ఏం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. మంచికి మంచి చెడుకు చెడు. అన్యాయంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే అరెస్టు చేస్తే పోలీసులకు తగిన శాస్తి చేయడం తప్పదు. పోలీసులు చట్టానికి లోబడి పని చేయాలి, ఏ పార్టీకి తొత్తులుగా వ్యవహరించకూడదు. అక్రమంగా మా కార్యకర్తలపై కేసులు పెడితే పోలీసులు ఎంక్వయిరీలు ఎదుర్కోక తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు.
చింతకాని మండలానికి ఎంతో ప్రేమతో కేసీఆర్ దళిత బంధును ప్రకటించారు. 3200 మందికి దళిత బంధు అకౌంట్ ఓపెన్ చేసి చాలావరకు దళిత బంధు డబ్బులు అందించారు. మిగిలిన కొంతమందికి పూర్తిగా దళితుబంధు రెండో విడతను విడుదల చేయాలని భట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో కూడా చింతకాని మండలానికి దళిత బంధు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. మీకు అండగా పార్టీ ఉంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ రెడ్డి తలకాయ లేని ముఖ్యమంత్రి.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
Harish Rao | మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలంటున్న రైతులు : హరీశ్‌రావు
Sambasiva Rao | రైతుల భూముల్లో ఫార్మాసిటీ ఏర్పాటు వద్దు : కూనంనేని సాంబశివరావు