పిల్లలు పాడైపోతున్నారు. స్మార్ట్ఫోన్లు చేతికొచ్చాక తమమాట వినడంలేదని పేరెంట్స్ గగ్గోలు పెడుతున్నారు. కానీ, వాళ్లిచ్చిన ఫోన్లకే పిల్లలు బానిసలు అవుతున్నారని గ్రహించట్లేదు. ‘మా సమస్యఫోన్ కాదు. మా కోసం సమయం కేటాయించేవాళ్లు లేకనే ఫోన్లో ఆడుతున్నాం. ఫోన్‌తో జీవిస్తున్నాం. మాకోసం సమయం కేటాయించి ఆడించండి.కథలు చెప్పండి. మారకపోతే అడగండి’అని పిల్లలు అడిగితే.. పెద్దలు చెప్పే సమాధానం ఏమిటి?
పిల్లలు రీల్స్ చూడటం వల్ల కలిగే అనర్థాలను ఓ యాంకర్ ఆయాసపడుతూ చెప్పింది. రెప్పార్పకుండా చూసిన లలిత వెంటనే ‘టింకూ’ అంటూ కేకేసింది. బుడిబుడి అడుగులు వడివడిగా వేసుకుంటూ టింకూ తన దగ్గరికి రాగానే.. ‘ఇదిగో ఈ రీల్ చూడు. నీ కోసమే’ అంటూ ఫోన్ చేతికిచ్చింది. రోజూ చేతిలో ఉన్న ఫోన్ గుంజుకునే అమ్మ పిలిచి మరీ ఫోన్ ఇస్తుంటే.. టింకూకి పట్టలేనంత సంతోషం. ఫోన్ స్క్రీన్ ముఖం ముందు పెట్టుకోగానే ‘ఈ రీల్ నీ కోసమే.. చూడు’ అంటూ ప్లే బటన్ నొక్కింది. రీల్స్ చూస్తే కంటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఎదుగుదల సమస్యలు అంటూ చెబుతూ పోతున్నది యాంకర్. ఆ రీల్ పూర్తవ్వగానే ఇంకో రీల్ రివ్వున రానే వచ్చింది. దాన్ని ఆపబోతే టింకూ ఒప్పుకోలేదు. మారాం చేయడం మొదలుపెట్టాడు. పిల్లలు ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు. కానీ, కొందరు మాత్రమే ఆ దిశగా ప్రయత్నిస్తారు. అలాంటి పేరెంటింగ్ పొందిన పిల్లలే రేపటి విజేతలవుతారు. లలిత అదే ప్రయత్నం చేసింది. కానీ, ఏది ప్రమాదమో దాన్నే చేతికిచ్చింది. ఇప్పుడు టింకూ మారేదెట్లా? ఇది ఒక్క లలిత బాధే కాదు. ప్రతి ఇంటిలో ఉన్న కథే!
రీల్స్ టూ రియల్
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? పెద్దలే పనులు పక్కనపెట్టి ఫోన్ చూస్తుంటే పిల్లలు ఆగుతారా? కాబట్టి ముందుగా ఫోన్ పక్కన పెట్టాల్సింది పెద్దలే! పిల్లల సమస్యకు అదే అసలైన పరిష్కారం. ఫోన్ పక్కన పెడితే పెద్దలకు మిగిలే సమయమంతా పిల్లలదే. కాబట్టి, వాళ్లతో కబుర్లు చెప్పొచ్చు. కాశీ మజీలీ కథలు వినిపించొచ్చు. రైమ్స్ పాడుతూ డ్యాన్సులు చేయొచ్చు. పేరెంట్స్ సమయం కేటాయిస్తే పిల్లలు స్మార్ట్ఫోన్లకు బానిసలు కారని సైకాలజిస్టులూ చెబుతున్నారు. ‘పిల్లల చేతిలో ఫోన్లు గుంజుకుని వాళ్లను ఏడిపించకుండా, మీ ఫోన్ జేబులో పెట్టి పార్కుకి పోదాం పదా’ అంటూ వారితో కలిసిపోవాలని సూచిస్తున్నారు. అప్పుడు రీల్స్‌లో మునిగిపోవడం మానేసి రియల్ లైఫ్‌లోకి వస్తారు.
ఒక్కటే దారి
స్మార్ట్‌ఫోన్‌తో ఎన్ని నష్టాలున్నాయి? ఏఏ సమస్యలు వస్తాయి? ఏ సమస్యకు ఏది పరిష్కారం? అంటూ మళ్లీ సోషల్ మీడియానే ఆశ్రయించకుండా.. పిల్లల్ని చేయిపట్టి సోషల్ లైఫ్‌లోకి నడిపించాలి. ప్రతిరోజూ కొంత సమయం పిల్లలకు కేటాయించినట్టుగానే, వాళ్ల కోసం కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే ఫోన్ చేతికి ఇచ్చినా చూడరు. అలా జరగాలంటే సాయంత్రాల్లో, సెలవు రోజుల్లో పిల్లలను వాళ్ల తీరున వాళ్లను వదిలేయకుండా.. పెద్దలు దగ్గరికి తీసుకోవాలి. వారికి నచ్చిన ఆటల్ని ఆడించాలి. కొత్తొక వింత కాబట్టి పిల్లలకు సంతోషం కలిగించేలా రోజుకో కొత్త ఆట, పాటతో వాళ్లకు కాలక్షేపం కలిగించాలి. అందుకే ఏం చేయాలి? ఎలా చేయాలో.. మీ ఇంట్లో, మీ ఆర్థిక స్థితి, మీకున్న సమయం, మీ పిల్లల వయసుని బట్టి మీరే ప్లాన్ చేసుకోండి. ఒకరిని చూసి పోల్చుకోవద్దని పిల్లలకు చెప్పే పెద్దలు ఈ విషయంలోనూ ఎవరితోనూ పోల్చుకోవద్దు. కాలక్షేపానికి ఇంటిని నందనవనంలా మార్చాలంతే.
కిడ్ మేకర్స్
చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. గీతల బొమ్మలు గీయడానికి, బొమ్మలకు రంగులు అద్దడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. అలాగే బొమ్మల తయారీకి బిల్డింగ్ బ్లాక్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా కార్డ్స్‌తో రకరకాల పేర్లు నేర్పిస్తూ కూడా ఆడించవచ్చు. పెద్ద పిల్లలు కూర్చుని ఆడే ఆర్ట్, క్ట్రాఫ్ట్తోపాటు సరదాగా స్నేహితులతో ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఇక కొందరు కొన్న బొమ్మలతో కన్నా.. సొంతంగా చేసిన బొమ్మలతోనే ఆడుకోవాలనుకుంటారు. ఇంట్లో ఉండే కార్టన్ బాక్సులతో పిల్లలతో మేడలు కట్టించవచ్చు. న్యూస్ పేపర్లో బొమ్మలు కత్తిరించి రకరకాల బొమ్మలను కొలువుదీర్చవచ్చు. కలర్ పేపర్స్, క్లేతో రోజుకో తీరుగా క్రాఫ్ట్స్ చేయవచ్చు. అయితే ఈ ప్రయత్నంలో చాలామంది మళ్లీ సోషల్ మీడియాలో ఉన్న రీల్స్ చూసేందుకే ప్రయత్నిస్తున్నారు. అలా కాకుండా పత్రికల్లో వచ్చే క్రాఫ్ట్స్ మేకింగ్ కటింగ్స్‌ని ఉపయోగించాలి. ఇలా చేస్తే పిల్లలకు సొంత ఆలోచన అలవడుతుంది.

Kids
ఇల్లే ఓ ప్రయోగశాల!
పిల్లల బుర్రే ఓ ప్రయోగశాల. వాళ్లకు వచ్చే ఆలోచనలెన్నో. గోడల మీద గీస్తే గద్దిస్తారు. పాత్రలన్నీ పేర్చి కొత్త కాపురం నడిపిస్తుంటే చిందర వందర చేశారని కోప్పడతారు. ఇలా కాకుండా వారికున్న స్కిల్స్‌తో ఇంట్లో సామాన్లు పేర్చడం, ఇల్లు సర్దడంలో వాళ్లను భాగస్వామ్యం చేయాలి. బాల్కనీలో, పార్కులో ఉన్న చెట్ల ఆకులు, పువ్వులను సేకరించి రంగులు, పేర్లు నేర్పించడంతోపాటు హెర్బేరియం కలెక్ట్ చేయించాలి. మ్యూజిక్, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్లకపోయినా ఇంట్లోనే స్నేహితులతో, పెద్దలతో కలిసి పాడేందుకు, డ్యాన్స్ చేసేందుకు పోటీలు పెట్టాలి. ఇదంతా అల్లరి అని పిల్లల కేరింతల్ని నిషేధించొద్దు. ఇలాంటి సందర్భాల్లో వాళ్లలో ఉన్న ప్రతిభ వెలుగులోకి రావొచ్చు. పిల్లలకు పాఠ్య పుస్తకాల ఆధారంగా క్విజ్ పోటీ నిర్వహించుకోవడం ఎలాగో దగ్గరుండి శిక్షణ ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్లే పెద్దలు సమాధానం చెప్పలేని కొత్తకొత్త ప్రశ్నలు వేస్తూ పోతారు. ఇంట్లోని బైక్, కార్ తుడవడం, కడగడం పిల్లలకు నేర్పాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఇంటి దగ్గరే అవగాహన కల్పించాలి.
లైఫ్ లెస్సన్స్
పిల్లలు చెప్పినట్టు వింటూ పోతున్న రోజుల్లోనే వాళ్లని సొంతంగా ఆలోచించడం, సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా పెంచాలి. పెంపకం అంత ప్రభావవంతంగా ఉండాలంటే వాళ్లకు ఈ రోజుల్లోనే స్మార్ట్‌ఫోన్‌తో ఉండే సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కల్పించాలి. వీటి గురించి పిల్లలతో పోస్టర్ డిజైన్ చేయించాలి. రోడ్డు భద్రత గురించి, పొగాకు, మద్యం, డ్రగ్స్‌తో ప్రమాదాల గురించి పిల్లలతో పోస్టర్లు చేయిస్తే.. ప్రమాదాలు, మోసాలు వాళ్లకు ముందే తెలుస్తాయి. వాటి జాగ్రత్తలు తెలుసు కాబట్టి నష్టపోరు. రేపటి రోజున స్కూల్లో, హాస్టల్లో ఫ్రెండ్స్ ప్రోత్సహించినా గంజాయి, స్మోకింగ్, పోర్న్ బారినపడకుండా సొంత వ్యక్తిత్వంతో నిలబడతారు. ‘పిల్లలు పాడైపోతున్నారు. పాడైపోతున్నారు’ అంటూ బాధపడకుండా.. ముందు చూపుతో పిల్లలకు మేలు దారి చూపితే భయమే ఉండదు. సో ముందుగా మారాల్సింది పెద్దలు.. అప్పుడు మీ పిల్లలు ఆలోమేటిక్‌గా మారిపోతారు!
…? నాగవర్ధన్ రాయల