సిద్దిపేట/గజ్వేల్, నవంబర్ 22: రైతుల పంటలు పండించే భూముల్లో ఫార్మాసిటీ(Pharmacity) ఏర్పాటు చేయడాన్ని సీపీఐ వ్యతిరేకిస్తుంది. గిరిజనుల భూములు వారికే ప్రభుత్వం అప్పగించి ఫార్మాసిటీని జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు( Sambasiva Rao) అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవన్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మంద పవన్‌తో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నదన్నారు.
లగచర్ల ఫార్మాసిటీని ఫోర్త్ సిటీగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రూ.2 లక్షల పైన పంట రుణమాఫీ పై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలు ఇచ్చిందని, వీటిపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని పార్టీ క్యాడర్‌కు ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఏం చేసిందని, మరో నాలుగేండ్లలో ఏమి చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో గడప మల్లేశ్, దయానంద్,జనార్దన్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.