వనస్థలిపురం, మార్చి 5 : అధిక వడ్డీ ఆశ చూపి, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసి రూ.లక్షల్లో వసూలు చేసిన ఓ ఘరానా లేడీ రూ. 25కోట్లకు పైగా వసూలు చేసి ఉడాయించిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కమలానగర్లో ఉన్న తన సొంత ఇంటిని ఒకరికి అగ్రిమెంట్ చేసి, మరొకరికి సేల్ డీడ్ చేసింది. ఇల్లు తమదంటే తమదని ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. డబ్బులు దండుకున్న సదరు మహిళ మాత్రం ఎవరికి దొరకకుండా తిరుగుతోంది. భర్త, కూతురును అమెరికాకు పంపించి ఆమె మాత్రం జల్సాలు చేస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంధువులు, స్నేహితుల వద్ద నుంచి తెచ్చి డబ్బులు ఇచ్చామని, తమకు ఆత్మహత్యే శరణ్యమని బాధితులు పేర్కొంటున్నారు.
రూ.10 వడ్డీతో మోసపోయారు..
వనస్థలిపురం కమలానగర్లో ఉండే బద్దం జ్యోతిరెడ్డి వనస్థలిపురం ప్రాంతంలో బాగా పరిచయాలు, పలుకుబడి ఉంది. రాజకీయంగా, సామాజికంగా ప్రజల్లో తిరుగుతూ ఉండేది. భర్త ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేసేవాడు. జ్యోతిరెడ్డి స్థానికంగా ఉన్న కొంతమందికి రూ.10వరకు వడ్డీ ఇచ్చేలా అప్పులు తీసుకుంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతున్నానని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేసింది. కొంత మంది రూ.3 కోట్ల వరకు కూడా ఇచ్చినట్లు బాధితులు పేర్కొంటున్నారు. కొన్ని రోజులు వడ్డీ సరిగ్గా చెల్లించిన జ్యోతిరెడ్డి ఆ తర్వాత మరి కొంత డబ్బు కావాలని లక్షల్లో అప్పు చేసింది. బాధితులు తమ డబ్బు ఇవ్వాలని అడిగితే రేపు, ఎల్లుండి అంటూ గడిపింది. దీంతో బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో కమలానగర్లో తన సొంత ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. దీంతో బాధితులు ఆమె ఇంటి గేట్‌పై కనబడుటలేదు అని ఫ్లెక్సీ కూడా అంటించి నిరసన తెలిపారు. తన ఇంటిని సుజిత్ అనే వ్యక్తికి సేల్ అగ్రిమెంట్ చేసింది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన రామకృష్ణారెడ్డికి సేల్‌డీడ్ చేసింది. కిలేడీ చేసిన మోసంపై పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
ఇరువర్గాలు ఘర్షణ..
జ్యోతిరెడ్డి ఇంట్లో అగ్రిమెంట్ చేసుకున్న సుజిత్ బంధువులు ఉంటున్నారు. కాగా బుధవారం రాత్రి సేల్ డీడ్ చేసుకున్న రామకృష్ణారెడ్డి ఇల్లు తమకు రిజిస్ట్రేషన్ అయ్యిందని, ఇంటిని తమకు ఇవ్వాలని అడిగారు. ఇరు వర్గాలు గొడవలు పడ్డారు. స్థానికుల సమాచారంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అక్కడున్న వారిని పంపించి వేశారు. ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. జ్యోతిరెడ్డి వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా జ్యోతిరెడ్డి ఎల్బీనగర్లో ఉన్న ఓ జ్యువెలరీలో రూ.6కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఇదంతా ముందుగానే గ్రహించిన జ్యోతిరెడ్డి తన భర్త, చిన్న కుమార్తెను అమెరికాలో ఉన్న పెద్ద కుమార్తె వద్దకు పంపించిందని బాధితులు పేర్కొంటున్నారు. కొంతమందికి వాట్సాప్ కాల్ మాట్లాడుతోందని పలువురు పేర్కొంటున్నారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.