హైదరాబాద్, మార్చి 5(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నిరుడు దండిగా వర్షాలు పడినా ప్రస్తుతం మార్చి నెల మొదట్లోనే నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. అసలు వేసవికాలమంతా ముందే ఉండగా ఈ ఏడాది అప్పుడే సగానికి పైగా చెరువులు ఖాళీ అయ్యాయి. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 932 మిల్లీమిటర్ల కంటే నిరుడు అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆరు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షం పడి వాగులు వంకలు పొంగిపొర్లాయి. అదీగాక నవంబర్ రెండో వారం వరకు అడపాదడప వర్షాలు పడినప్పటికీ నీటిని ఒడిసిపట్టకపోవడం వల్ల ప్రస్తుతం సగానికి సగం చెరువులు ఖాళీగా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నది.
10,700 చెరువులు ఖాళీ
రాష్ట్రంలో చెరువులు, కుంటలు కలిసి 34,712 ఉన్నాయి. అందులో కేవలం మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు 21,500 ఉన్నాయి. చెరువుల కింద దాదాపు 25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. అయితే ప్రస్తుతం 10,700 చెరువుల్లో సగం కంటే తక్కువగా నీటి నిల్వలే ఉన్నాయి. మిగిలిన వాటిలో అంతంతమాత్రమే. 5.95శాతం చెరువుల్లోనే నీటినిల్వలు కొద్దిమేర ఆశాజనకంగా ఉన్నాయి. కరీంనగర్, మంచిర్యాల, మెదక్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, కుమ్రం భీం ఆసిఫాబాద్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, ములుగు తదితర జిల్లాల్లోని చెరువుల్లో 35శాతం కంటే తక్కువగానే నీటి నిల్వలు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
కాంగ్రెస్ నిర్లక్ష్యం.. పొంచి ఉన్న ప్రమాదం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి పాలకుల తరహాలోనే చెరువులను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది. పేరుకే పలుచోట్ల చెరువులను నామమాత్రంగా నింపుతున్నది. కానీ చాలా చెరువులను క్రమబద్ధంగా నింపే ప్రక్రియను విస్మరించింది. ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి కొరత ఉండకూదనే కారణంగా చెరువులను నింపడం మానేసింది. మరోవైపు కాళేశ్వరం, దేవాదుల తదితర లిఫ్ట్ స్కీమ్‌లను పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. ఇప్పటికే పలుచోట్ల రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు వేసవికాలమంతా ముందే ఉన్నది. తాగునీటి ఎద్దడి ప్రమాదం పొంచి ఉన్నది.
కేసీఆర్ పాలనలో జలవనరులు ఫుల్
తెలంగాణ భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే రాష్ట్రంలో 80శాతం గట్టి రాతిపొరలే ఉన్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలోనే ఇసుక రాతిపొరలు ఉన్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో వర్షపాతం కూడా తకువ. ఇక అన్నింటికీ మించి నాలుగు నెలల పాటే అత్యధికంగా వర్షపాతం ఉంటుంది. మిగిలిన ఎనిమిది నెలల పాటు డ్రై స్పెల్స్(వర్షాలు ఉండవు) కొనసాగుతాయి. ఇక ఇక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురిసినా కూడా భూమిలోకి ఇంకేది మాత్రం 10శాతానికి మించదని భూగర్భశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో నీటిని ఒడిసిపట్టడంలో, భూగర్భజలాలను పెంచడంలో చెరువులు, చెక్‌డ్యామ్‌లు తదితర పెర్కొలేషన్ నిర్మాణాలే అత్యంత కీలకపాత్రను పోషిస్తాయి.
ఈ అంశాలను ఆకళింపు చేసుకున్న నాయకుడు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటగా మిషన్ కాకతీయ చేపట్టి చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నారు. విస్తృతంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. అంతేగాక సమైక్యపాలనలో విచ్ఛిన్నమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునఃప్రతిష్ఠ చేయడంలో భాగంగానే వాటిని ప్రాజెక్టులతో అనుసంధానించారు. ఏటా జనవరి లేదంటే ఫిబ్రవరిలోనే చెరువులను క్రమం తప్పకుండా నింపేలా చర్యలు చేపడుతూ వచ్చారు. ఫలితంగానే రాష్ట్రంలో భూగర్భజల మట్టం పెరుగుతూ వచ్చింది. పంటలకు భరోసా దక్కింది.

P