Harish Rao | హైదరాబాద్ : పూటకో మాట మాట్లాడడం.. మాట మార్చడంలో సీఎం రేవంత్ రెడ్డి పీహెచ్డీ పూర్తి చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సెటైర్లు వేశారు. రేవంత్ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రేవంత్ రెండు నాల్కల ఆణిముత్యాలను తెలంగాణ భవన్ వేదికగా హరీశ్‌రావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతుబంధు, బతుకమ్మ చీరలు, ఎల్ఆర్ఎస్, పోటీ పరీక్షల వాయిదా, కులగణన సర్వే, కూల్చివేతలు, ఏక్ పోలీసు, మద్యం అమ్మకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, సోనియా గాంధీ బలిదేవత, పార్టీ ఫిరాయింపులు, శిలాఫలకాలు, పేపర్ యాడ్స్, మూసీ అభివృద్ధి, అడ్వైజర్లకు కేబినెట్ హోదా, యూట్యూబ్ చానెల్స్, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, బూటకపు ఎన్కౌంటర్లపై రేవంత్ రెడ్డి మాట్లాడిన డబుల్ స్టాండర్డ్స్‌ను హరీశ్‌రావు వీడియో ఆధారాలతో ప్రజలకు చూపించారు.
పై అంశాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు.. అధికారంలోకి వచ్చాక ఏం మాట్లాడిండు అనే విషయాలను కళ్లకు కట్టినట్లు తెలిపారు హరీశ్‌రావు. కేసీఆర్ రెండు పంటలకే రైతుబంధు ఇస్తున్నాడు.. మేం అధికారంలోకి వస్తే మూడు పంటలకు రైతుబంధు ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలను హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇక మంచి డిజైన్లతో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు పంపిణీ చేస్తామన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు హరీశ్‌రావు. ఎల్ఆర్ఎస్ విషయంలో రేవంత్ రెడ్డి మాట మార్చిన తీరును కూడా వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షల విషయంలో రేవంత్ రెడ్డిది డబుల్ స్టాండ్ కాదు.. ట్రిపుల్ స్టాండ్ అని హరీశ్‌రావు ఎద్దెవా చేశారు. కుల గణన సర్వేపై రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో విషయాన్ని హరీశ్‌రావు వివరించారు. ఇక కూల్చివేతల విషయానికి వస్తే.. తెలియక, అమాయకంగా కొనుగోలు చేసిన వారి విషయంలో రెగ్యులరైజ్ చేయొచ్చు కదా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిండు.. అధికారంలోకి వచ్చాక కూల్చివేతలపై రేవంత్ రెడ్డి మాట మార్చారని హరీశ్‌రావు మండిపడ్డారు.
అధికారం కోసం ఏక్ పోలీసు.. తర్వాత నో పోలీసు అని రేవంత్ అన్నారు. బెల్ట్ షాపుల వల్ల సంసారాలు నాశనం అవుతున్నాయి. ఇప్పుడేమో పల్లెలు తాగాలి.. ఖజానాలు నిండాలనే ధోరణితో విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు అనుమతి ఇస్తున్నారని రేవంత్ అరాచకాలపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలిపోవడం జరిగిపోయిందని రేవంత్ వ్యాఖ్యానిస్తే.. కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్న కొండా సురేఖ రంగ నాయక సాగర్ ద్వారా నీళ్లు విడుదల చేసిందని హరీశ్‌రావు గుర్తు చేశారు.
టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ బలి దేవత అని అన్నడు. ఇప్పుడేమో సోనియమ్మ మా అమ్మ.. నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్నతల్లి అని అంటుండు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని రాళ్లతో కొట్టి చంపండి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నడు.. ఇప్పుడేమో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నడు. శిలాఫలకాలపై కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఎందుకు రాస్తున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి అని రాయొచ్చు కదా..? అని ప్రశ్నించాడు. ఇప్పుడేమో ప్రతి శిలాఫలకంపై తన(రేవంత్ రెడ్డి) బొమ్మ వేయించుకుంటున్నాడంటూ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హాయంలో అడ్వైజర్లకు కేబినెట్ హోదా కల్పిస్తే.. ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ హోదాకు వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు వేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే సలహదారులకు కేబినెట్ హోదా కల్పించారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణి.
👉 పూటకో మాట మాట్లాడటం, మాట మార్చడంలో PhD పూర్తి చేసిన రేవంత్ రెడ్డి
👉 రేవంత్ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రేవంత్ రెండు నాల్కల ఆణిముత్యాలు విడుదల చేసిన మాజీ మంత్రి శ్రీ @BRSHarish గారు
✳️ Thread on Revanth Reddy Double Standards 👇
1)… pic.twitter.com/a3D9o67JRM
— Office of Harish Rao (@HarishRaoOffice) December 2, 2024
ఇవి కూడా చదవండి..
Constable Nagamani | ఆస్తికోసం.. కానిస్టేబుల్ నాగమణి హత్యలో ట్విస్ట్.. వెలుగులోకి కొత్త కోణం
SI Harish | తుపాకీతో కాల్చుకుని.. వాజేడు ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య