Harish Rao | హైదరాబాద్ : డబుల్ ఎడ్జ్ నైఫ్తోనైనా జాగ్రత్తగా ఉండొచ్చు.. కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిపై హరీశ్‌రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
ఈ నెల ఏడో తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జీషీటు వేస్తాం. ఈ ఏడాది కాలంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మాట మార్చిన తీరు రేవంత్‌లో కనిపిస్తుంది. సీఎం అయ్యాక కూడా ఆయన మాట మార్చిన తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు.
ప్రజలను ఏ రకంగా మోసం చేస్తున్నారు.. వంచిస్తున్నారు.. ఆయన నైజం ఏంటో ప్రజల ముందు నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. రెండు తలల పామును చూసి భయపడుతాం. కానీ పాపం అది ఏం అనదు.. పెద్ద ప్రమాదకరం కాదు. రెండు నాల్కల ధోరణి కలిగిన మనషులు ఉంటారు. కానీ అలాంటి వారిని పెద్దగా పట్టించుకోం. కానీ అది చాలా ప్రమాదకరం. ఈ రెండు నాల్కల వైఖరి నిదర్శనం ఎవరంటే నిస్సందేహాంగా రేవంత్ రెడ్డి అని చెప్తారు. డబుల్ ఎడ్జ్ నైఫ్తోనైనా జాగ్రత్తగా ఉండొచ్చు.. కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్. సమాజానికి చాలా నష్టం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక విషయంపై నిన్న, నేడు, రేపు ఒక మాట మాట్లాడడం. ఇందులో రేవంత్ రెడ్డి పీహెచ్డీ చేశారు. మాట మార్చడంలో, పూటకో మాట మాట్లాడడంలో రేవంత్ రెడ్డి దిట్ట. నేను ఆ మాట అనలేదు.. ఎవరు అన్నారంటూ ఉల్టా దబాయించి ముచ్చటగా మూడో మాట చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది. ఇవన్నీ రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ అగ్ర నాయకులను రాక్షసులు అంటడు. మళ్లీ అదే పార్టీలో చేరి దేవతలు అంటడు. రాక్షసులు అన్న నోటితోనే దేవతలను పొగుడుతాడు. సిగ్గు, ఎగ్గు, సంకోచం, వ్యాకోచం ఏం లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడే తత్వం రేవంత్ రెడ్డిది అని హరీశ్‌రావు దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి..