న్యూఢిల్లీ, మార్చి 11: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హొర్ముజ్ జలసంధిని మూసివేయడంతోపాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న చమురు రిఫైనరీలు, డిపోలపై ఇరాన్ జరుపుతున్న దాడులతో చమురు, గ్యాస్ సరఫరాకు ఏర్పడుతున్న అంతరాయం తాజాగా ఎరువుల సరఫరాకు సైతం విస్తరించింది. దీని ప్రభావం వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌పై కూడా పడనున్నది. హొర్ముజ్ మూసివేత వల్ల భారత్‌కు 20-25 శాతం ఎరువుల కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణుల అంచనా. చమురు తరహాలోనే ఎరువులు కూడా యూఏ ఈ, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు హొర్ముజ్ ద్వారా సరఫరా అవుతాయి.
భారతదేశానికి చెందిన నైట్రోజన్ ఎరువుల దిగుమతుల్లో 63 శాతం గల్ఫ్ దేశాల నుంచే ఉంటాయి. వీటిలో యూరియా, అమోనియా, డీఏపీ 32 శాతం ఉంటాయి. భారత్‌కు చెందిన పొటాష్ దిగుమతుల్లో 42 శాతం సౌదీ అరేబియా నుంచి వస్తాయి. ఎరువుల దిగుమతుల్లో ఇరాన్ ప్రత్యక్ష వాటా చాలా తక్కువ. 2024లో యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ నుంచి 23.1 కోట్ల డాలర్ల విలువైన యూరియాను భారత్ దిగుమతి చేసుకుంది. అదే ఇరాన్ నుంచి కేవలం 25.9 లక్షల డాలర్ల విలువైన యూరియాను మాత్రమే దిగుమతి చేసుకుంది. ఇరాన్ నుంచి భారత్ నేరుగా ఎరువులను కొనుగోలు చేయనప్పటికీ గల్ఫ్ దేశాల నుంచి కొనుగోలు చేసిన ఎరువుల నిల్వలు హొర్ముజ్ జలసంధి మీదుగా మాత్రమే నౌకల ద్వారా సరఫరా అవుతాయి. హొర్ముజ్ మూసివేతతో ఇప్పుడు ఎరువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎరువుల సరఫరాకు అంతరాయం ఏర్పడితే అది ఎరువుల కొరతకు, ధరల పెరుగుదలకు దారితీసి దేశంలో ఆహార భద్రతా సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలు
ఎరువుల కొరతను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలు కూడా పరిమితంగా ఉన్నాయి. ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ అయితే చాలా పరిమిత సంఖ్యలో ఉంటాయి. ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలు రష్యా, చైనా మాత్రమే. చైనాపై ఆధారపడడం తగ్గించుకోవడానికి గల్ఫ్ దేశాల నుంచి యూరియా దిగుమతి పట్ల భారత్ గతంలో మొగ్గుచూపింది. రష్యా నుంచి కూడా ఎరువులను దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. కాగా, ఈ హొర్ముజ్ జలసంధితో ఎటువంటి సంబంధం లేకుండా ఈ రెండు దేశాల నుంచి ఎరువులను దిగుమతి చేసుకునే సౌకర్యం భారత్‌కు ఉంటుంది.
యూరియా ప్లాంట్లపై ప్రభావం
గ్యాస్ లభ్యత తగ్గడంతో పలు వాణిజ్య యూరియా ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గుముఖం పడుతున్నది. దీంతో తమ సామర్థ్యంలో 60 శాతాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలోని యూరియా లభ్యతపై తీవ్ర ప్రభావం పడి కొరత ఏర్పడే అవకాశముంది. గ్యాస్ ఎనర్జీ ధరలు పెరిగితే ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతాయి. తద్వారా ఎరువుల ధరలు కూడా భారీగా పెరగవచ్చు. ఇప్పటికే గత నెల రోజుల వ్యవధిలో అంతర్జాతీయంగా యూరియా ధర 25 శాతం పెరిగి టన్ను 600 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం లభ్యమవుతున్న గ్యాస్ వనరులను ఉపయోగించుకుని గరిష్ఠంగా ఎరువులను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని పలు కంపెనీలు తెలిపాయి. కొన్ని ఎరువుల కంపెనీలు తమ వార్షిక షట్‌డౌన్ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లాలని యోచిస్తున్నాయి. కాగా, దేశానికి అవసరమైన గ్యాస్‌లో 50 శాతానికి పైగా భారత్ దిగుమతుల పైనే ఆధారపడుతున్నది. ప్రస్తుతం పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు, హొర్ముజ్ జలసంధి వివాదం కారణంగా గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది.