హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణా జిల్లాలోని సోనార్పూర్లో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అభిషేక్ బెనర్జీపై బీజేపీ గుండాలు దాడి చేయడాన్ని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదన్నారు. బాధ్యులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రముఖ ప్రతిపక్ష నాయకుడికి తగినంత పోలీసు భద్రతను ఉద్దేశపూర్వకంగా కల్పించలేదని ఇది బీజేపీ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించాలన్నారు. కాగా, ఎన్నికల అనంతర హింసాకాండలో హత్యకు గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి కోల్కతా శివార్లలోని సోనార్పూర్ పట్టణానికి అభిషేక్ బెనర్జీపై రాళ్లు, గుడ్లతో దాడికి పాల్పడ్డారు.
ఆయన క్రికెట్ హెల్మెట్ ధరించి పాత్రికేయుల సహాయంతో ఆ గుంపు నుండి తప్పించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్టే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నాయకులు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిని అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు.