Kerala : కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. కేరళ, ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో శనివారం భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. అలాగే, ఈ శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వాగమాన్ జిల్లాలో కూడా కొండచరియలు విరిగిపడటం వల్ల ఒకరు మరణించారు. ప్రభాకరన్ నాయర్ అనే అతడి మృతదేహం ఇంకా లభించలేదు. అడూర్మాలా ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపడటంతో ఒకరు చిక్కుకుపోయారు.
అలాగే, కోచి-ధనుష్కోడి నేషనల్ హైవే, మాచిప్లావు వద్ద కూడా కొండచరియలు విరిగిపడిన కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇడుక్కి జిల్లాలోని ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఇంట్లో ఉన్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. కొట్టాయం జిల్లాలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయారు. కేరళలోని అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అనేక చోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 183వ జాతీయ రహదారిపై వందిపెరియార్ ప్రాంతంలో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో రోడ్డు మార్గం మొత్తం బ్లాక్ అయింది. మరోవైపు నీటి మట్టం ఇంకా పెరిగిపోతోంది. పైగా చుట్టుపక్కల డ్యామ్ల నుంచి గేట్లు ఎత్తడంతో ఈ రోడ్డుపైకి ఇంకా నీరు చేరే అవకాశం ఉంది. ఎరాట్టుపేట, కంజిరాపల్లి, కూట్టిక్కల్, ఎరుమెలి వంటి అనేక పట్టణాలు కూడా నీట మునిగాయి.
పూంజార్ ప్రాంతంలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఇంట్లో ఇద్దరు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజల్ని రక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేరళలోని వయనాడ్ సహా అనేక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరిస్తున్నారు. అనేక ప్రాంతాలకు ఆరెంజ్, రెడ్ అలెర్ట్ జారీ చేశారు.