Amit Shah : పంజాబ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. బీజేపీ ప్రస్తుతం పంజాబ్‌లో నషా ముక్త్ పంజాబ్ యాత్ర పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా పంజాబ్, జలంధర్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీపై, కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు.
వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందుకే, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పంజాబ్ ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే.. పంజాబ్‌లో అధికారంలోకి వస్తే డిసెంబర్ 31, 2029లోపు రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా మారుస్తాం అన్నారు. కృత్రిమ మత్తు పదార్థాల్ని అమ్ముకునేందుకు పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం అనుమతించిందని ఆరోపించారు. పంజాబ్‌లో రైతులు, పరిశ్రమలు, వ్యవసాయం, శాంతి భద్రతల సమస్య, మహిళల రక్షణ వంటి సమస్యలు ఉన్నాయన్నారు.
బీజేపీ ఇచ్చిన హామీలపై కేజ్రీవాల్ అండ్ కంపెనీ ఏం స్పందిస్తుందో చూడాలని షా అన్నారు. ఇచ్చిన హామీల్ని బీజేపీ నెరవేరుస్తుందని గుర్తు చేశారు. మోదీ నాయకత్వంలో కాశ్మీర్లో బీజేపీ తీవ్రవాదాన్ని అంతం చేసిందన్నారు. అలాగే, 50 ఏళ్లుగా దేశంలోని కీలక సమస్య అయన నక్సలిజాన్ని నిర్మూలించామన్నారు. ఇప్పుడు పంజాబ్ నుంచి డ్రగ్స్‌ను అంతం చేస్తామని హామీ ఇచ్చారు.
2004 నుంచి 2014 వరకు దేశంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న సమయంలో 26 లక్షల కేజీల డ్రగ్స్‌ను సీజ్ చేస్తే.. 2014 నుంచి 2024 వరకు తమ ప్రభుత్వం 1.2 కోట్ల కిలోల డ్రగ్స్ సీజ్ చేసిందని వివరించారు. కాంగ్రెస్ (యూపీఏ) హయాంలో సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.40,000 కోట్లు అయితే, తమ ప్రభుత్వం రూ.1.90 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిందని వెల్లడించారు.