Deool band 2 | మరాఠీ సినీ పరిశ్రమలో మరో చిన్న సినిమా భారీ సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దేవూల్ బంద్ 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రవీణ్ ట్రేడ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్నేహల్ ట్రేడ్ మోహన్ జోషి కీలక పాత్రలు పోషించారు. మే 21న విడుదలైన ఈ సినిమా కేవలం తొమ్మిది రోజుల్లోనే సుమారు రూ.40 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా మరాఠీ చిత్రాలు పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కినా, బలమైన కథా కథనాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుంటాయి. అదే కోవలో వచ్చిన ‘దేవూల్ బంద్ 2’ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
కేవలం రూ.9 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే తన బడ్జెట్‌కు నాలుగు రెట్లు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 మరాఠీ చిత్రాల జాబితాలో చోటు సంపాదించడం విశేషంగా మారింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే, సంగీత పేగుడే అనే మహిళా రైతు చుట్టూ కథ తిరుగుతుంది. ఈ పాత్రను స్నేహల్ తార్డే ఎంతో సహజంగా పోషించారు. పేదరికం, అప్పులు, కష్టనష్టాలతో నిత్యం పోరాడే సంగీత తన జీవితంలో మార్పు కోసం ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. అయితే ఎంత మొరపెట్టుకున్నా తన సమస్యలు తీరకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురవుతుంది.
ఒక రోజు ఆవేదనతో నది ఒడ్డున ఉన్న చీమల పుట్టపై రాయిని విసిరికొడుతుంది. ఆ ఘటన అనంతరం ఆమెకు ఆధ్యాత్మిక గురువు స్వామి సమ్రత్ దర్శనమిస్తారు. ఆ తర్వాత సంగీత జీవితంలో చోటుచేసుకునే మార్పులు, ఆమె ఎదుర్కొనే సంఘటనలు, విశ్వాసం మరియు జీవిత సత్యాల మధ్య జరిగే సంఘర్షణలే సినిమా ప్రధాన కథాంశంగా తెరకెక్కించబడ్డాయి. గ్రామీణ నేపథ్యంలో ఆధ్యాత్మికతను, భావోద్వేగాలను మిళితం చేస్తూ దర్శకుడు ప్రవీణ్ తార్డే కథను ప్రేక్షకులకు చేరవేశారు. ముఖ్యంగా రైతుల సమస్యలు, వారి జీవన పోరాటం, భక్తి మరియు నమ్మకాలపై సినిమా తీసుకున్న దృక్పథం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అందుకే విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి మంచి మౌత్ పబ్లిసిటీ లభించింది.
ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చిత్రీకరణ సమయంలో కీలక సన్నివేశాల కోసం చిత్రబృందం ఏకధాటిగా 33 గంటల పాటు షూటింగ్ నిర్వహించిందని సమాచారం. ఆ కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తంగా చూస్తే, పెద్ద స్టార్లు లేకుండా, పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ‘దేవూల్ బంద్ 2’ ప్రస్తుతం మరాఠీ సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బలమైన కథ ఉంటే చిన్న సినిమాలు కూడా భారీ విజయాలు సాధించగలవని మరోసారి ఈ చిత్రం నిరూపించింది.