Maharastra : అనలాగ్ పనీర్ (Non-dairy paneer) తయారీ, విక్రయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం (Maharastra Govt) నిషేధం విధించింది. ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు, రూ.లక్ష జరిమానా విధించనుంది. ఈ పనీర్ తినడంవల్ల మరణం సంభవిస్తే శిక్ష తీవ్రత పెరుగుతుందని వెల్లడించింది. యావజ్జీవ కారాగారశిక్ష, రూ.10 లక్షల జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. కల్తీ పాల ఉత్పత్తుల అమ్మకాలను అరికట్టడమే లక్ష్యంగా ఆహార భద్రతా సంస్థ ఈ ఆదేశాలు జారీచేసింది. దాంతో ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) తర్వాత అనలాగ్ పనీర్‌పై ఈ ఆంక్షలు విధించిన రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.
ఈ నిషేధం వార్తతో ఇంటర్నెట్లో అసలు పనీర్, అనలాగ్ పనీర్‌కు మధ్య తేడా ఏంటని నెటిజన్లు చర్చిస్తున్నారు. తయారీలో వాడే వస్తువుల ఆధారంగా సాధారణ పనీర్‌తో పోలిస్తే ఇది చౌకగా లభిస్తుంది. ఇందులో పాలను ఉపయోగించరు. పామాయిల్ వంటి వెజిటేబుల్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. దాంతోపాటు స్టార్చ్, పాలపొడిని వాడుతుంటారు. చూడటానికి అసలు పనీర్‌లాగే కనిపించినప్పటికీ దాంతో పోలిస్తే సగం ధరకే దొరుకుతుంది. దీని గురించి వినియోగదారులకు సరైన సమాచారం ఇవ్వకుండా అసలైన పాల ఉత్పత్తిలాగే అనలాగ్ పనీర్‌ను విక్రయిస్తుండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం తాజా చర్యలు తీసుకుంది.