Dulquer Salmaan | ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ పేరుతో కొనసాగుతున్న నకిలీ ఎక్స్ ఖాతా వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. @_dulQuer అనే పేరుతో ఉన్న ఈ ఖాతా తన అధికారిక ఖాతా కాదని దుల్కర్ సల్మాన్ స్పష్టం చేసిన కొద్ది గంటల్లోనే.. ఆ ఖాతా నిర్వాహకుడు క్షమాపణలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. తన పేరుతో కొనసాగుతున్న ఈ ఖాతా వల్ల తనతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని దుల్కర్ సల్మాన్ తెలిపారు. ఈ ఖాతా తనను అనుకరిస్తూ సినిమాలు, ఇతర నటీనటులకు సంబంధించిన పోస్టులు చేస్తోందని, దీంతో ఆ వ్యాఖ్యలు నిజంగానే తనవే అని కొందరు భావించే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు అనవసరమైన గందరగోళానికి, ప్రతికూలతకు దారితీస్తాయని తెలిపారు.
దుల్కర్ నుంచి స్పష్టత వచ్చిన తర్వాత సదరు ఖాతా నిర్వాహకుడు క్షమాపణలు కోరుతూ ఒక నోట్‌ను పంచుకున్నాడు. ఈ ఖాతాను మొదట్లో సరదాగా, అభిమానుల అకౌంట్‌గా సృష్టించానని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో దుల్కర్ సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులు, శీర్షికలను కూడా ఈ ఖాతాలో పంచుకున్నానని, దాంతో మరింత గందరగోళం ఏర్పడి ఉండొచ్చని అంగీకరించాడు. దుల్కర్ సల్మాన్‌తో పాటు ఆయన కుటుంబం, స్నేహితులు, తన ఖాతా ద్వారా తప్పుగా మోసగించబడిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు ఖాతా నిర్వాహకుడు పేర్కొన్నాడు. అయితే ఈ క్షమాపణలపై కూడా కొందరు సోషల్ మీడియా వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దుల్కర్ ఈ ఖాతా గురించి బహిరంగంగా స్పందించిన తర్వాతే క్షమాపణ చెప్పడం ఎందుకని కొందరు ప్రశ్నించారు.
మరికొందరు అకౌంట్ పేరును మార్చడం లేదా పూర్తిగా నిలిపివేయడం మంచిదని సూచించారు. ఇంకొందరు మాత్రం దుల్కర్ పేరును ఉపయోగించి ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే, దుల్కర్ సల్మాన్ ఇటీవల నహాస్ హిదయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఐమ్ గేమ్’ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన తెలుగు రొమాంటిక్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’లో నటిస్తున్నారు. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కొత్త నటి సాత్విక వీరావల్లి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కొత్త దర్శకుడు రవి నెలకుడితి తెరకెక్కిస్తున్న ‘శ్రీ శ్రీ’ చిత్రంలోనూ దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా కనిపించనున్నారు.