Manoj Muntashir | ఆదిపురుష్ సినిమాకు డైలాగులు రాసిన మనోజ్ ముంతాషిర్ (Manoj Muntashir) నితేష్ తివారీ రామాయణను ఆదిపురుష్‌తో పోల్చవద్దని సూచించారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆదిపురుష్, రామాయణ గురించి ఈ విధంగా స్పందించారు. ఆదిపురుష్ రిలీజ్ కాకముందే బాలీవుడ్లో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. రామాయణం ఆధారంగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ నటించారు. ఈ సినిమా 2023లో రిలీజ్ అయ్యింది. సినిమా చూసినవారు విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదని, డైలాగ్స్ అంతగా ఆకట్టుకోలేదని విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డైలాగులు రాసిన మనోజ్‌ను అప్పట్లో తీవ్రంగా విమర్శించారు.
ఆదిపురుష్ (Adipurush) ఒక విఫలప్రయత్నమని అంగీకరిస్తూ మనోజ్ ముంతాషిర్ నితేష్ తివారీ రూపొందిస్తున్న రామాయణ సక్సెస్ కావాలని టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ఆసక్తితో తీసిన ఆదిపురుష్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయామని అంగీకరించడంలో సిగ్గుపడటం లేదు. కానీ ఆ సినిమా సంగీతం మాత్రం ప్రేక్షకులకు అమితంగా నచ్చడం చాలా గర్వంగా ఉందని మనోజ్ అన్నారు. రామాయణ సంగీతం కూడా అంతకంటే గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నానని కోరుకున్నారు. అదేవిధంగా యష్ చాలా మంచి నటుడు అని కొనియాడారు.
సాక్నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం రూ. 500 కోట్లతో నిర్మించిన ఆదిపురుష్ భారతీయ చిత్రాల్లో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచింది. కానీ ఈ సినిమా ఆ వ్యయాన్ని రాబట్టుకోలేకపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 393 కోట్లు వసూలు చేసిందని నివేదిక తెలిపింది.
సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలతో నితేష్ తివారీ రూపొందిస్తున్న ‘రామాయణ’ ఈ ఏడాది దీపావళికి మొదటి భాగం, వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం విడుదల కానున్నది. దీనిలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, రాముడి తండ్రి దశరథుడి పాత్రలో అరుణ్ గోవిల్, సాయి పల్లవి సీతాదేవిగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. అరుణ్ గోవిల్ 90లో దూరదర్శన్‌లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న రామాయణ సీరియల్లో రాముడిగా నటించారు. మొదట ఈ దశరథుడి పాత్ర కోసం అజింక్యా డియోను అనుకున్నారు. అనుకోకుండా అరుణ్ గోవిల్‌ను తీసుకున్నారు.