Rohit Vemula Act | యూనివర్సిటీలలో, కాలేజీలలో పీడిత కులాల నుండి వచ్చిన విద్యార్థుల పై కులవివక్ష చూపడం వలన డ్రాప్ అవుట్లు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వీటి నివారణకు రోహిత్ వేముల చట్టం కోసం ఐక్యంగా పోరాడు దామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని జాఫర్ నిజాం హాల్లో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేయూ కన్వీనర్ దండు నవకిరణ్ అధ్యక్షతన “రోహిత్ వేముల యాక్ట్” పై వివిధ విద్యార్థి సంఘాల, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్, విద్యా పరిరక్షణ కమిటీ కార్యదర్శి ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రెండువేల సంవత్సరాలకుపైగా విద్యకు దూరం చేయబడ్డ అణగారిన వర్గాలు యూనివర్సిటీ విద్యలోకి, కాలేజీ విద్యలోకి ప్రవేశించడమే ఒక మహత్తర పోరాటమని ఆయన అన్నారు. అటువంటి విద్యార్థులను అక్కున చేర్చుకుని చదువు చెప్పే బదులు “మీకు చదువు రాదు” ” మీరు పాస్ కాలేరు” అని ఆత్మ న్యూణ్యత భావానికి గురి చేయడం, స్కాలర్షిప్లు, ఫెలోషిపులు తగ్గించడం లేదా ఆలస్యంగా ఇవ్వడం, రియంబర్స్మెంట్ ఉన్నా వీరి దగ్గర నుండి బలవంతంగా ఫీజులు వసూలు చేయడం లాంటి కొత్త రూపాలలో కులవివక్ష రాజ్యమేలుతుందని ఆయన వివరించారు.
ASA రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ దొంత ప్రశాంత్ మాట్లాడుతూ..అణగారిన కులాల నుండి వచ్చిన లక్షలాదిమంది విద్యార్థులు డ్రాప్ అయి ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాదిమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అందుకే ఈ కుల వివక్షను రూపుమాపడానికి తెలంగాణలో రోహిత్ వేముల చట్టం తీసుకురావడానికి మనమందరము కలిసి కృషి చేద్దామని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాకతీయ యూనివర్సిటీ డెవలప్ మెంట్ అథారిటీ ప్రొఫెసర్ వై.వెంకయ్య మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న వివక్షతను తిప్పి కొట్టకపోతే.. మనం బానిసలుగా బతకాల్సిందేనని ఆయన హెచ్చరించారు. కేయూ కాలేజెస్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ప్రొఫెసర్ వరలక్ష్మీ మాట్లాడుతూ.. విద్యాలయాల్లో వివక్షత నిర్మూలనకు వేముల రోహిత్ చట్టం తప్పకుండా కావాలన్నారు. కేయు ప్రొఫెసర్ జి.సమ్మయ్య మాట్లాడుతూ.. బహుజనుల తల రాతను మార్చే రాజ్యాంగాన్ని సంపితే మనమంతా చనిపోయినట్లేనని, రాజ్యాంగ రక్షణే మనకు రక్షణ అని అన్నారు.
కేయూ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయిస్ నాయకులు డాక్టర్ పుల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మానసికంగా ఐక్యమై క్షేత్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాలని ఆయన కోరారు. న్యాయవాది బండి మొగిలి మాట్లాడుతూ..సాంఘికంగా మనమంతా చైతన్యం కావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ బిక్షాలు,, న్యాయవాది దండు మోహన్, డిబిఎఫ్ రాష్ట్ర నాయకులు చుంచు రాజేందర్లతో పాటు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గోని మాట్లాడారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు దూడపాక శ్రీకృష్ణ, మంద నరేష్, శ్రవణ్, అన్నమయ్య, సాయికుమార్, రొడ్డ రాంబాబు, భారత్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
