అమరావతి : మాజీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy ) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ( Chandrababu ) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్నినో దెబ్బకు పచ్చటి పొలాలు ఎండిపోతున్న సమయంలో, రాయలసీమ 8 జిల్లాల్ని హార్టీకల్చర్ హబ్ గా మారుస్తా అంటూ డైవర్షన్ కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు.
నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఇప్పటి వరకు రాయలసీమలో ఒక్కటంటే ఒక్కటి 50 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టలేదని పేర్కొన్నారు. మండు టెండల్లో రాయలసీమ జిల్లాలో ఉద్యాన వనాలు పెంచుతారా? మొక్క బతకటానికి నీరెక్కడిది అని ప్రశ్నించారు. నీరు లేకుండా, భారీ నీటి రిజర్వాయర్లు లేకుండా, కాల్వలు తవ్వకుండా, ఉద్యాన వనాలు, నందన వనాలు ఎలా పెంచుతారో, కాస్త ఆ సీక్రెట్ చెప్పాలని సూచించారు. మీ వ్యవహారం చూస్తుంటే ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు.
ఏపీలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండకుండా వైసీపీలోని కోటరీ నాయకులు టీడీపీ అదుపాజ్ఞలో నడుస్తున్నారని విమర్శించారు. రైతుల అప్పులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల అప్పులు, వారికి టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు వంటి అంశాలను గట్టిగా నిలదీయలేని వైసీపీ లాంటి రాజకీయ పార్టీల వల్ల ఎవరికి ప్రయోజనముందని అన్నారు.