Naga Chaitanya | టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభుతో తన గత బంధంపై సామాజిక మాధ్యమాలలో వస్తున్న దుష్ప్రచారాలు, పరువు నష్టం కలిగించేలా ఉన్న పోస్టులపై ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సంబంధిత వెబ్సైట్లకు నోటీసులు జారీ చేసింది. నాగచైతన్య తరఫు న్యాయవాది వైభవ్ గగ్గర్ వాదనలు వినిపిస్తూ, ఆన్లైన్లో వస్తున్న కంటెంట్ కేవలం ట్రోలింగ్ మాత్రమేనని, ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని కోర్టుకు తెలిపారు. చైతన్య సమంతను మోసం చేశాడని, ఆమె కెరీర్‌ను నాశనం చేశాడంటూ కొన్ని వెబ్సైట్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య పేరు, చిత్రాలు, వీడియోలను దుర్వినియోగం చేయకుండా ఆయన పర్సనాలిటీ రైట్స్‌ను రక్షించాల్సిందిగా కోరారు.
ఈ కేసును మే 29న విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని బెంచ్, నాగచైతన్య పేరు, ఫోటోలను తప్పుడు ప్రచారాలకు ఉపయోగించకుండా తాత్కాలిక నిషేధాజ్ఞలు విధించింది. అలాగే సదరు ఆరోపణలతో కూడిన కథనాలను ప్రసారం చేసిన వెబ్సైట్లకు నోటీసులు పంపింది.
గతంలో, నాగచైతన్య మరియు సమంతలు నాలుగేళ్ల వైవాహిక బంధం తర్వాత అక్టోబర్ 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. దశాబ్ద కాలంగా తమ మధ్య ఉన్న స్నేహమే తమ బంధానికి బలమని, విడిపోయినా ఆ ప్రత్యేక అనుబంధం అలాగే ఉంటుందని వారు అప్పట్లో పేర్కొన్నారు. 2009లో ‘ఏ మాయ చేసావె’ సినిమా సెట్స్‌లో కలుసుకున్న వీరిద్దరూ, 2014లో ‘ఆటోనగర్ సూర్య’ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అనంతరం 2017లో గోవా వేదికగా వివాహం చేసుకున్నారు.
విడాకుల తర్వాత ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగారు. నాగచైతన్య డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నటి శోభితా ధూళిపాళ్లను సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోగా, సమంత డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో పాత విషయాలపై ఇంకా జరుగుతున్న అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకే నాగచైతన్య తాజాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.