BRSV : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థులు, యువత విజయమని బీఆర్ఎస్వి(BRSV) రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును అణచివేయాలని చూసిన కేంద్ర ప్రభుత్వానికి ఈ పరిణామం చెంపపెట్టని ఆయన పేర్కొన్నారు. ధర్మేంద్ర రాజీనామాతో గత కొద్ది రోజులుగా విద్యార్థులు చేస్తున్న పోరాటం ఫలించిందని శ్రావణ్ కుమార్ తెలిపారు.
ఢీల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP), తెలంగాణలో BRSV ఆందోళనతో పాటు దేశవ్యాప్తంగా విద్యార్థులు చేసిన పోరాటానికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని నెమ్మాది శ్రవణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థుల నిరసనలను అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం చివరకు ప్రభుత్వానికే నష్టాన్ని మిగిల్చిందని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే దేశ యువత తగిన సమాధానం చెబుతుందని ఈ ఉద్యమ పోరాటం ఒక సందేశం ఇచ్చిందని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులపైన లాఠీఛార్జి, హింసకు పాల్పడిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకువాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మన దేశ యువత సాధించిన గొప్ప విజయమం. యువతరం కచ్చితంగా ఈ దేశాన్ని మార్చగలరు. మీరు పట్టుబడితే ఏదైనా సాధించగలరు. స్వరం మారుతున్నది నవతరం మారుతున్నది. రాజ్యమా ఉలికిపడు’ అంటూ గర్జించిన యువతరానికి వందనం పాదాభివందనం’ అని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో కూడా మూడేళ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిరుద్యోగ యువతలో తీవ్రమైనా అసంతృప్తి పెరిగిపోయిందని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని జెన్జీల ఆగ్రహానికి సీఎం గురికావాల్సి వస్తుందని శ్రావణ్ కుమార్ హెచ్చరించారు.