PM Modi : భారతదేశ భద్రతకు ముప్పు కలిగించే ఏ చర్యనూ తాము ఉపేక్షించబోమని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై భారత్ ‘జీరో టాలరెన్స్ (Zero Tolerance)’ విధానాన్ని అనుసరిస్తోందని తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్ (Mann Ki Baat)’ కార్యక్రమంలో.. టెర్రరిజంపై దేశం అవలంభిస్తున్న విధానాన్ని ప్రధాని వివరించారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టంచేశారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని, ఉగ్రదాడులకు భారత్ తగిన సమాధానం ఇస్తుందని మోదీ పేర్కొన్నారు.
సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టి పదేళ్లు అవుతోందని ప్రధాని గుర్తుచేశారు. నాడు ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సదరు ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. రాత్రికిరాత్రే ఆపరేషన్ పూర్తిచేసి సైనికులు తిరిగి వచ్చారని చెప్పారు. ఉగ్రవాదానికి సంబంధించిన కీలక కేంద్రాలు, శిక్షణ, ఆయుధాలు, నిధుల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నామని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో సాయుధ బలగాల ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించారు. దేశ రక్షణకోసం వారు చేసిన త్యాగాలను ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో దేశం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రపదేశ్‌లోని యువత ఓ పురాతన బావిని శుభ్రం చేస్తున్న వీడియోను మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ పంచుకున్నారు. చెత్తచెదారంతో కూడిన బావిని యువకులు శుభ్రం చేస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. గతంలో జరిగిన కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని పురాతన బావిని శుభ్రం చేయడాన్ని మోదీ ప్రస్తావించారు.