న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని దీటుగా ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి కుంటినడకన సాగుతున్నది. ముఖ్యంగా కూటమి వైఫల్యానికి ఇంతవరకు దానికి నేతృత్వం వహించిన రాహుల్ గాంధీ వైపే ముఖ్య పార్టీలు వేలెత్తి చూపుతున్నాయి. ఇది ఏర్పడిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఇండియా కూటమి గెలిచిన పాపాన పోలేదన్న విషయాన్ని అవి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియా కూటమి నాయకత్వ మార్పుపై మరోసారి చర్చకు తెరలేచింది.
విపక్ష ఇండియా కూటమికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సరిగ్గా సరిపోతారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సోమవారం చేసిన వ్యాఖ్యలతో విస్తృతంగా చర్చ ప్రారంభమైంది. ఈ ప్రతిపాదనకు ఆ పార్టీలోని కొందరు సభ్యులు మద్దతు తెలుపగా, కాంగ్రెస్ ఉన్నత వర్గాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ పదవి చేపట్టాలంటూ పలు పార్టీల నేతలు సూచించిన కొన్ని వారాల తర్వాత తాజాగా స్టాలిన్ పేరు తెరపైకి వచ్చింది.
కూటమికి స్టాలిన్ నాయకత్వం వహించడం మేలు చేస్తుందని మణిశంకర్ అయ్యర్ సోమవారం పేర్కొన్నారు. ‘ఒక్క తమిళనాడు సీఎం మాత్రమే 2029 ఎన్నికల్లో కూటమికి విజయాన్ని చేకూర్చగలరు’ అని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2029 ఎన్నికల లక్ష్యాన్ని సాధించడానికి దళపతి స్టాలిన్ కన్నా సరిగ్గా సరిపోయే నేత ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇండియా కూటమి మనుగడకు మమతా బెనర్జీ కేంద్ర బిందువు అని అన్నారు. ఊరికే ఆ పదవిని పట్టుకుని ఉండకుండా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ చిన్న పార్టీలకు చెందిన ఎంకే స్టాలిన్, మమతా దీదీ, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ లేదా మరొకరికో ఆ పదవిని అప్పగించాలని సూచించారు.
బీజేపీపై పోరాటానికి తమ పార్టీ అధినేత స్టాలినే నేతృత్వం వహించాలని డీఎంకే డిమాండ్ చేసింది. తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షంగా కొనసాగుతున్న డీఎంకే.. ఇండియా కూటమి నాయకత్వ మార్పును కోరుకుంటున్నది. పలు రాష్ర్టాలకు చెందిన నేతలు కూడా తన తండ్రి ఎంకే స్టాలిన్ కూటమికి నేతృత్వం వహించాలని కోరుతున్నారని ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. రాజకీయాల్లోనూ, ప్రజాపాలనలోనూ స్టాలిన్ ఒక ఉదాహరణగా నిలుస్తున్నారని ఆయన అన్నారు.
వరుస ఓటములతో కుదేలైన ఇండియా కూటమి ప్రస్తుత నాయకత్వాన్ని మార్చాల్సిందేనని పలు పార్టీలు తెగేసి చెబుతున్నాయి. నాయకత్వ మార్పునకు సంబంధించి అన్ని పార్టీలు చర్చలు జరపాల్సిన అవసరాన్ని శివసేన (యూబీటీ) ఉద్ఘాటించింది. ‘కూటమిని ఏలేది స్టాలినా, మమతా బెనర్జీయా లేక మరొకరా అన్నది తర్వాత.. ముందు నాయకత్వ మార్పు గురించి కూటమిలో చర్చ జరగాలి’ అని శివసేన పార్టీకి చెందిన సామ్నా ఎడిటోరియల్ ప్రశ్నించింది. కాగా, నాయకత్వ మార్పునకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి సమావేశం జరగలేదని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. మణిశంకర్ అయ్యర్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారని అది తప్పు కాదన్నారు.