నర్సింహులపేట, ఫిబ్రవరి 23 : కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. పంటకు నీరు అవసరమైన సమయంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి రెండు రోజులైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులే తలా కొంత వేసుకొని మరమ్మతు చేయించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామ రెవెన్యూ శివారులోని వ్యవసాయ మోటర్లకు విద్యుత్తు సరఫరా అయ్యే ట్రాన్స్ఫార్మర్ తరచూ కాలిపోతుంది. తాజాగా కాలిపోయి రెండు రోజులైంది. ఆకేరువాగు ఒడ్డున ఉన్న ట్రాన్స్ఫార్మర్ను వరి పొలాల్లోంచి రోడ్డు మీదికి తీసుకురావడానికి రైతులు అష్టకష్టాలుపడుతున్నారు.
సోమవారం కూలీలు సహా ఎనిమిది మంది రైతులు కలిసి కర్రల సాయంతో ట్రాన్స్ఫార్మర్ను భుజానికి ఎత్తుకొని వరి పొలాల నుంచి బయటికి తీసుకొచ్చారు. దాదాపు కిలోమీటరు వరకు మోసుకొచ్చారు. మరమ్మతు కోసం అక్కడి నుంచి మరిపెడకు తీసుకెళ్లారు. ఏడాదిలో వానకాలంలో మూడుసార్లు, యాసంగిలో ఇప్పటికే రెండోసారి మొత్తం ఐదుసార్లు కాలిపోయిందని రైతులు చెప్తున్నారు. ఒకసారి ట్రాన్స్ఫార్మర్ బయటికి తీసుకొచ్చి, మళ్లీ బిగించడానికి కూలీల ఖర్చు రూ.6 వేలు అవుతున్నదని రైతులు వాపోతున్నారు. దీనికితోడు ట్రాక్టర్ కిరాయి తామే భరించాల్సి వస్తున్నదని అన్నారు.
ఒకసారి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అన్ని ఖర్చులు కలిపి రూ.12 వేల వరకు ఖర్చు వస్తుందని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కింద ఉన్న వారమంతా తలా కొన్ని డబ్బులు వేసుకొని మరమ్మతు ఖర్చులు భరిస్తున్నట్టు చెప్పారు. పంట దిగుబడి కంటే ట్రాన్స్ఫార్మర్ ఖర్చులే ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ను రోడ్డుకు సమీపంలోకి మార్చాలని కోరుతున్నారు.
నేను భూమి కౌలుకు తీసుకొని వరిపొలం సాగు చేస్తున్న. వానకాలంలో మూడుసార్లు, యాసంగిలో ఇప్పటికే రెండుసార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. పంట దిగుబడి కంటే ట్రాన్స్ఫార్మర్ మోత ఖర్చులే ఎక్కువయ్యాయి. పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను రోడ్డుకు తీసుకొచ్చేందుకు కూలీలకు రూ.6 వేలు అవుతుంది. ఒకసారి ట్రాన్స్ఫార్మర్ను మరిపెడకు తీసుకెళ్లి మరమ్మతు చేయించి మళ్లీ తీసుకొచ్చి బిగించడానికి మొత్తం రూ.12 వేలు అవుతున్నది. పొలాల నుంచి ట్రాన్స్ఫార్మర్ను తీసి రోడ్డుకు దగ్గర వేసి మా బాధ తీర్చాలి.
– భూక్యా బాలకిషన్, కౌలు రైతు