కరకగూడెం, ఆగస్టు 17 : ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్వీర్యం అవుతోంది. అందుకు నిదర్శనమే కరకగూడెం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం. ప్రజావాణికి 17 శాఖలకు గానూ 9 మంది మండల స్థాయి అధికారులు మాత్రమే హజరయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి సమస్యలు తలెత్తిన ప్రజావాణిలో పరిష్కరించుకోవచ్చు అన్న ఆశ రోజురోజుకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరు గారిపోతుంది. తమ సమస్యలను పట్టించుకునే అధికారులు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయమై ఎంపీడీవో శ్రీనివాసును ‘ నమస్తే’ వివరణ కోరగా… రెండు, మూడు మండలాలకు కలిపి కొంతమంది అధికారులు ఒక్కరే ఇన్చార్జిలుగా ఉండగా రాలేకపోయారని, అలాగే కొంతమంది అధికారులు శిక్షణ కార్యాక్రమంలో ఉన్నారని తెలిపారు. హాజరుకాని శాఖల అధికారుల వివరాలను జిల్లా కలెక్టర్ కు నివేదిక రూపంలో అందజేశామని తెలిపారు. ఈ ప్రజావాణిలో ఆరుగురు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు.