నిషిన్: ఇప్పుడిప్పుడే క్రికెట్ ఓనమాలు నేర్చుకుంటున్న జపాన్‌లో అభిమానులకు ఆటలోని అసలైన మజాను, అంతకుమించిన ఉత్కంఠను అందించేందుకు భారత్, పాకిస్థాన్ సిద్ధమయ్యాయి. ఆసియా క్రీడల టీ20 క్రికెట్లో శనివారం చిరకాల ప్రత్యర్థులు ఫైనల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత ఎడిషన్‌లో స్వర్ణం నెగ్గి వరుసగా రెండో పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా.. ద్వితీయ శ్రేణి పాకిస్థాన్‌ను చిత్తుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగాల్లో చూసినా అయ్యర్ సేనకు ‘మెన్ ఇన్ గ్రీన్’ దరిదాపుల్లో కూడా లేదు. అయితే ద్వితీయ శ్రేణి జట్టే అయినా ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. పీఎస్ఎల్లో మెరుపులు మెరిపించి గతంలో పాక్‌కు ఆడిన అనుభవమున్న కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, హసన్ నవాజ్, అబ్రార్ అహ్మద్ వంటి ఆటగాళ్లపై దాయాది జట్టు ఆశలు పెట్టుకుంది.