పల్లె వాడకట్టు నుంచి పట్నంలోని దాటి ట్యాంక్‌బండ్ వరకు.. ఈ సారి వినాయక నవరాత్రుల్లో ఒక ఆసక్తికరమైన సాంస్కృతిక దృశ్యం కనిపించింది. మండపంలో గణనాయకుడు.. మది నిండా జననాయకుడు అన్నట్టుగా ఉత్సవాలు సాగాయి. మంత్రోచ్ఛారణల మధ్య పూజలందుకున్న వినాయకుడి మండపమే కేసీఆర్ గీతాలకు వేదికైంది. డప్పు దరువుకు పల్లె జనం కాలు కదిపిండ్రు.. పెద్దలు వంత పాడిండ్రు.. యువత గొంతు కలిపింది. నిన్నటి రాజకీయ ప్రచార గీతం.. నేటి పండుగ సంబురంలో భాగం అయింది. ఇది కేవలం రాజకీయ ప్రచారమా? లేక తెలంగాణ సామూహిక జ్ఞాపకంలో సజీవంగా ఉన్న అనుభవమా?
తెలంగాణలో పండుగలంటే కేవలం పూజల తంతు మాత్రమే కాదు. బతుకమ్మైనా.. బోనాలైనా.. వినాయక నవరాత్రులైనా.. రేపటి దుర్గోత్సవాలైనా ఊరంతా ఒక్కచోట చేరి గుండె గొంతుకను వినిపించే సాంస్కృతిక కల్లం. కులాల పొలిమేరలు కాసేపు పలుచబడే చోటు. బతుకు బాధలను.. దాంట్లోనే కాసింత మురిపాన్ని.. జీవిత కాల రందిని పంచుకునే సామూహిక వేదిక. చేలల్లో రైతు.. ఆటో నడుపుకునే యువకుడు.. సద్ది మూటగట్టుకునిపోయే కూలీ, చదువులకు పోయే విద్యార్థి.. సడుగులుడికి గడప పట్టుకుని కూర్చున్న ముసలవ్వ.. అందరూ ఒక్కచోట కలిసే సామాజిక కేంద్రం.
అలాంటి నిఖార్సయిన వేదిక మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు గీతమై మోగినప్పుడు.. చిన్నాపెద్ద కాలు కదిపినప్పుడు.. వృద్ధులు గొంతు కలిపి పాడినప్పుడు.. రాజకీయ విరోధులు సైతం ఆ క్షణంలో విభేదాలు పక్కనపెట్టి చప్పట్లు కొట్టినప్పుడు.. అదొక సామాజిక-సాంస్కృతిక దృగ్విషయం. దీన్నంతటినీ కేవలం రాజకీయ కోణంలోనే చూడటం అంటే.. వాస్తవిక అంతరార్థాన్ని విస్మరించడమే అవుతుంది. పాటతో పోరాటాన్ని పలికించి.. డప్పు దరువుతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించి.. పాటలనే ఆయుధాలుగా మలిచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్న గడ్డ ఇది. ఇక్కడ రాజకీయం కూడా పాటల బాణీల్లోనే పలుకుతుంది. అందుకే గతంలో ఎన్నికల ప్రచారంలో మార్మోగిన కేసీఆర్ పాటలు.. వర్తమానంలో కేసీఆర్ పాలనను గుర్తుచేసే గీతాలుగా మళ్లీ వినిపిస్తున్నయి.
ప్రజలు గతాన్ని జ్ఞాపకంగా మాత్రమే మోసుకుపోరు. తాము అనుభవించిన నిన్నటిని.. తమ కండ్ల ముందున్న ఈనాటిని తూకం వేసుకుంటరు. తూకంలో తేడా ఎంత వస్తే.. గతం అంత గాఢమైన జ్ఞాపకంగా మారుతుంది. వ్యవసాయమే జీవనాధారమైన ఈ నేలకు రైతుబంధు ఒర చేయూత. కేసీఆర్ సర్కార్ తొలుత ఎకరాకు రూ.4 వేలతో మొదలుపెట్టి.. 2019-20 నుంచి ఎకరాకు సీజన్‌కు రూ.5 వేలకు పెంచింది. అంటే ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు. విత్తనం కొనుకునే వేళ రైతు చేతికి అందిన పైస.. ఎరువుల బస్తా కోసం తోడుగా నిలిచిన సాయం. రూ.73 వేల కోట్లు పల్లె ఆర్థిక వ్యవస్థలోకి ప్రవహించిన వాస్తవం.
అదే జ్ఞాపకం పేదింటి ఆడబిడ్డ పెండ్లి ముంగిట కనిపించింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు పుష్కకాలం నిండింది. 2018లో రూ.75,116 నుంచి రూ.1,00,116కు పెంచిండ్రు. పేద తల్లిదండ్రులకు ఆదరువుగా నిలిచింది. నెల మొదటి తేదీ కోసం ఎదురు చూసే అవ్వాతాతల జీవితంలో ఆసరా మరో జ్ఞాపకం.
ఉమ్మడి రాష్ట్రంలో రూ.200గా ఉన్న వృద్ధాప్య పింఛన్… తెలంగాణలో రూ.1,000కు పెరిగింది. దివ్యాంగుల పింఛన్ రూ.500 నుంచి రూ.1,500కు పెరిగింది. ఆ తర్వాత వృద్ధులు, వితంతువులకు రూ.2,016.. దివ్యాంగులకు రూ.3,016గా పెరిగిన మొత్తాలు పింఛన్ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇచ్చినయి. అవ్వాతాతలకు మందు గోళీలు కొనుక్కునే స్వేచ్ఛ.. మనవడికి చిల్లర ఇచ్చిన మురిపెం.. ఇంట్లో తన మాటకు ఇంకా విలువ ఉన్నదనే ఆత్మవిశ్వాసాన్ని నింపిన జ్ఞాపకం.
చెరువు.. చేను.. బిందె.. రైతు ఈ నాలుగు తెలంగాణ గుండె చప్పుళ్లు. ఐదేండ్లలో 46,300 చెరువులను పునరుద్ధరించాలన్న మిషన్ కాకతీయ సంకల్పం పంట పొలాలకు పసరు పోసింది. ‘మిషన్ భగీరథ’ ఆడబిడ్డలు భుజాలపై తరతరాలుగా మోసిన బిందె బరువును దించిం ది. 54 లక్షలకు పైగా నివాసాలకు గోదావరి, కృష్ణా జలాలను నల్లాల ద్వారా అందించింది. తొలిపొద్దుతోనే బిందె పట్టుకుని బయలుదేరే ఆడబిడ్డలకు.. దూరపు బావుల దగ్గర పడిగాపులు కాసే తల్లులకు ఊరట దొరికింది. తరతరాల నీటి గోసకు దొరికిన ఉపశమనంగా మిగిలింది. అరవై ఏండ్ల కరువుకు కాళేశ్వరం ఒక సమాధానం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు, భారీ పంపుహౌస్‌లతో గోదావరి నీటిని ఎదురెకించి దాదాపు 1,600 కిలోమీటర్ల కాలువల గుండా మళ్లించిన తీరు సామాన్యుడిని ఆశ్చర్యపరిచింది. తెలంగాణ సాగునీటి చర్చలో ఒక పెద్ద అధ్యాయంగా నిలిచింది.
వాన కోసం ఆకాశం వైపు చూసిన నేల.. పంట నూర్పిళ్ల వేళ ధాన్యపు రాశులతో కళకళలాడింది. తెలంగాణ ఏర్పడే నాటికి దాదాపు 35 లక్షల టన్నులుగా ఉన్న ధాన్యం దిగుబడి.. ఆ తర్వాత ఏటా దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల టన్నుల స్థాయికి చేరింది. అప్పటి నుంచే రైతు జ్ఞాపకంలో కాలువలో నీరు.. నిండిన చెరువు.. పచ్చని పంట అనే దృశ్యాలు ఒక జ్ఞాపకంగా ఉన్నయి. వర్తమానంలో వర్షాల లోటు, నీటి సమస్యలు, వ్యవసాయ పరిస్థితులపై గ్రామాల్లో వినిపిస్తున్న ఆవేదన. ఆనాడు ఎంతటి ఎండకాలమైనా చెరువులు మత్తళ్లు దుంకినయి.. కాల్వల పొంటి నీళ్లు గలగల పారినయి. ఆ నీళ్లకు ఇప్పుడేమైంది? అనే ప్రశ్న రచ్చబండ దగ్గర వినిపించినప్పుడు.. అది కేవలం గతాన్ని పొగిడే మాట కాదు. నిన్నటి అనుభవాన్ని నేటి పరిస్థితితో పోల్చుకునే సామాజిక మనస్తత్వం.
ఇంతటి పరిణామంలో అత్యంత కీలకమైన అంశం యువతరంలో కనిపిస్తున్న స్పందన. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగినప్పుడు ఈ పోరలు బడిలో పుస్తకాలు మోసిన తరం.. ఇప్పుడు గణపతి మండపాల దగ్గర కేసీఆర్ పాటలకు కాలు కదిపారు. గణనాయకుని వేదికల మీద చేతిలో జన నాయకుని బొమ్మ పట్టుకుని నాట్యం చేసింది. చేయడం.. సారు పాటలను తమ గొంతుతో పాడటం.. వాటిని మళ్లీ మళ్లీ వినిపించడం.. కేవలం ఒక రాజకీయ నాయకుడిపై అభిమానంగా కొట్టిపారేయలేని పరిణామం.
ఎందుకంటే కేసీఆర్ పాలనలోని ప్రతి నిర్ణయాన్నీ ప్రత్యక్షంగా అనుభవించిన తరం కాదు. కానీ తన కుటుంబంలో, తన ఊరిలో, తన చుట్టూ జరిగిన మార్పుల కథలుగా వింటూ పెరిగిన తరం. పెద్దలు చెప్పిన అనుభవాలు.. ఉద్యమ జ్ఞాపకాలు.. వర్తమానంలో ఎదురవుతున్న పరిస్థితులు.. ఇవన్నీ కలిసే వారి రాజకీయ పరిజ్ఞానాన్ని నిర్మిస్తయి. అందుకే ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో వినిపించిన పాట.. ఇప్పుడు వారి చేతిలో కొత్త అర్థాన్ని సంతరించుకుంటున్నది. అది గతాన్ని గుర్తుచేసే పాటగానే కాకుండా.. తమకు చెప్పబడిన ఒక తెలంగాణ పాఠ్యాంశంగా మారుతున్నది.
అట్లా ఒక రాజకీయ ప్రచార గీతం.. రాజకీయపు పరిధిని దాటి ఒక సామూహిక సాంస్కృతిక వ్యక్తీకరణగా మారింది. శాంతిభద్రతల పేరుతో కొన్ని చోట్ల పాటలపై ఆంక్షల ప్రయత్నాలు జరిగితే.. అవి మరింత రాజకీయ చర్చకు దారితీశాయన్న వాదన కూడా వినిపించింది. ప్రజల ఆలోచన వద్దని వారిస్తే అది మరింత బలమైన ప్రతిస్పందనగా మారుతుందన్న
సామాజిక మనస్తత్వానికి ఈ పరిణామం ఒక ఉదాహరణగా కనిపిస్తున్నది.
అంతిమంగా వినాయక మండపాల సాక్షిగా బయటపడిన విషయం ఒక్కటే.. కేసీఆర్ ఆనవాళ్లను ఎవరో చెరిపేస్తానంటే చెరిగిపోయే నాయకుడు కాదు. ఆయన నిర్మించిన శకం ఒక వ్యక్తి తలపోత.. ఒక పాలనా కాలపు అనుభవం.. ఉద్యమం నుంచి సంక్షేమం వరకు సాగిన ఒక తరం సామూహిక స్మృతి. మట్టిని ప్రేమించి.. నీటిని మళ్లించి.. రైతును మురిపించి.. పల్లెను పొంచిందిన పచ్చని పైరులాంటి సజీవ జ్ఞాపకం. అందుకే సామూహిక పండుగ ఏదైనా పల్లె గుండెల్లోంచి మళ్లీ మళ్లీ వినిపిస్తున్న ‘సారే కావాలంటున్నరే.. తెలంగాణ పల్లెల్లల్లా.. మళ్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా’ అంటూ హోరెత్తున్న ఈ గీతం రేపటి తెలంగాణ రాజకీయ తీర్పునకు స్థిరమైన సంకేతాలిస్తున్నయి.
కేసీఆర్ ఆనవాళ్లను ఎవరో చెరిపేస్తానంటే చెరిగిపోయే నాయకుడు కాదు. ఆయన నిర్మించిన శకం ఒక వ్యక్తి తలపోత.. ఒక పాలనా కాలపు అనుభవం.. ఉద్యమం నుంచి సంక్షేమం వరకు సాగిన ఒక తరం సామూహిక స్మృతి. మట్టిని ప్రేమించి.. నీటిని మళ్లించి.. రైతును మురిపించి.. పల్లెను పొంచిందిన పచ్చని పైరులాంటి సజీవ జ్ఞాపకం. అందుకే సామూహిక పండుగ ఏదైనా పల్లె గుండెల్లోంచి మళ్లీ మళ్లీ వినిపిస్తున్న ‘సారే కావాలంటున్నరే.. తెలంగాణ పల్లెల్లల్లా.. మళ్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా’ అంటూ హోరెత్తున్న ఈ గీతం రేపటి తెలంగాణ రాజకీయ తీర్పునకు స్థిరమైన సంకేతాలిస్తున్నయి.
-వర్ధెల్లి వెంకటేశ్వర్లు