రాబర్ట్ ైక్లెవ్కు అమ్ముడుపోయి భారత్‌లో బ్రిటిష్ దురాక్రమణకు పునాది వేసిన దేశద్రోహి మీర్ జాఫర్. తనను సైన్యాధ్యక్షుడిగా నియమించిన రాజు సిరాజ్ ఉద్ దౌలాకు వెన్నుపోటు పొడిచి బ్రిటిష్ వారి అండతో బెంగాల్‌కు నవాబయ్యాడు. ఈ చరిత్ర సరిగ్గా తెలంగాణలో పునరావృతమైంది. రాబర్ట్ైక్లెవ్ లాంటి చంద్రబాబుతో చేతులు కలిపి, రేవంత్ తెలంగాణకు సీఎం కాగలిగారు. బాబు ప్రయోజనాలు కాపాడుతూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారు. వలస పాలకుల పీడనతో తలపడి మన రాష్ట్రం మనకు సాధించిపెట్టిన నాయకుడు కేసీఆర్ వ్యక్తిత్వంపై విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు కండ్లల్లో ఆనందం కోసం ఉద్యమ సారథిపై కుట్రలు పన్నుతున్నారు. తెలంగాణ వనరులను బాబు పరం చేయడానికి పావులు కదుపుతున్నారు.
తెలంగాణలో చంద్రబాబు చేసిన కుట్రలను తిప్పికొట్టిన కేసీఆర్‌ను దెబ్బతీయాలని రేవంత్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంపై అవాకులు చెవాకులు పేలారు. రేవంత్ కుట్రలో ఎర్రవల్లికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులకు స్థానిక ప్రజలే సమాధానం చెప్పారు. చంద్రబాబు, సమైక్యవాదుల కుట్రలను తిప్పికొడుతూ హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ సాధించారు. హైదరాబాద్ చేజారడం రేవంత్ గురువుకు మింగుడుపడని విషయం. దీంతో తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేసి, దొరికిపోయిన చరిత్ర గురుశిష్యులది. ఆ కేసులో ఇరుక్కుని కరకట్టకు పారిపోయిన చంద్రబాబును భుజాలపై ఎక్కించుకుని తెలంగాణకు తీసుకురావడానికి ఆయన శిష్యబృందం, భజనబృందమైన బంటు మీడియా ఆపసోపాలు పడుతున్నాయి.
తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నంతవరకు తమ దోపిడీ సాగదని సమైక్యవాదులు, వారి వందిమాగధులు భావించారు. రేవంత్‌లో మీర్ జాఫర్‌ను చూసుకున్నారు. దోపిడీ వర్గాల అండదండలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి తెలంగాణ అస్తిత్వానికి ఆపద తలపెడుతున్నారు. కేసిఆర్ అమలు చేసిన పథకాలు ఆపివేశారు. పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను తప్పించుకోవడానికి కేసిఆర్‌పై అబద్ధపు ఆరోపణలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
రైతులు సాగునీటి కోసం కాలువల వెంట, ప్రాజెక్టుల వెంట తిరుగుతుంటే రేవంత్ బలగం మాత్రం కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నారు. కృష్ణా నీళ్ళు కుప్పంకు పోతున్నాయి, వెలిగొండకు చేరుతున్నాయి.. పోతిరెడ్డిపాడు పోటెత్తుతున్నది. అవుకు రిజర్వాయర్ అలుగు పారుతున్నది. పాలమూరు భూములు మాత్రం పడావు పడుతున్నాయి. 74 శాతం కృష్ణా పరీవాహకంలో ఉన్న పాలమూరు భూములు గొంతెండి గుక్కపట్టి ఏడుస్తున్నాయి. కృష్ణానదిపై సర్వహక్కులు ఉన్న పాలమూరు.. తనకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి కన్నీళ్లు పెడుతున్నది.
వచ్చిన నీటిని వచ్చినట్టే పెన్నా బేసిన్‌లోని సీమాంద్రకు వదిలేసిన రేవంత్ ద్రోహానికి పాలమూరు విలవిల్లాడుతున్నది. ఎండిపోతున్న మా పంటలకు నీళ్లివ్వండిని ప్రాజెక్టుల దగ్గరకెళ్లిన రైతులను రేవంత్ ప్రభుత్వం తరిమికొడుతున్నది. కాంగ్రెస్ సర్కార్ తీరును చూసి పాలమూరు గుడ్ల నీరు కుక్కుకుంటున్నది. హక్కులేని నీటిని కూడా ఆంధ్రకు పంపిన రేవంత్ ద్రోహానికి పాలమూరు రైతులు బలవుతున్నారు. రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకుండా, ప్రతిపక్ష నేతల ఇండ్ల చుట్టూ, చేండ్ల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ మూకలకు రైతులే రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పి తీరుతారు.
-జూలూరు గౌరీశంకర్