ములుగు: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీశ్ (SI Harish) ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. అయితే ఏటూరునాగారంలో ఎన్కౌంటర్ జరిగిన రాత్రే ఆయన సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నత అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఏటూరునాగారం మండలం చెల్పాక-ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య భీకరపోరు కొనసాగింది. ఇరువర్గాల మధ్య హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. రెండు ఏకే 47 తుపాకులతోపాటు మరో ఐదు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఆరుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు కాగా, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన ఏగోలపు మల్లయ్య ఉన్నారు. తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు సమీప గ్రామాల ప్రజలు చెప్తున్నారు.
చెల్పాక పంచాయతీ పరిధిలోని పోలుకమ్మ వాగు గొత్తికోయగూడేనికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం పుల్లలమెద తోగు సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శబరీశ్ పరిశీలించారు. మృతుల్లో నర్సంపేట-ఇల్లందు ఏరియా దళ కమాండర్ కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35), డివిజన్ కమిటీ సభ్యుడు ఏగోలోపు మల్లయ్య అలియాస్ కోటి (43), ఏరియా కమిటీ సభ్యురాలు ముసకి జమున (23), ఏరియా కమిటీ సభ్యుడు కరుణాకర్ (22) ఉన్నట్టు ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ వెల్లడించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉన్నదని చెప్పారు. పీఎల్జీఏ వారోత్సవాలకు ఒకరోజు ముందు మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ దెబ్బ కోలుకోలేని దెబ్బతగిలింది.