న్యూశాయంపేట, మార్చి 17: వ్యక్తిగత అభివృద్ధితోనే జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చునని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత డాక్టర్ ఎండి రాజమహ్మద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా హంటర్ రోడ్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో మంగళవారం ‘వ్యక్తిత్వవికాసం నాయకత్వ లక్షణాలు’ అనే అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రాజ్మహ్మద్ పాల్గొని వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలపై ప్రసంగించారు. వ్యక్తిత్వ వికాసం అనేది కుటుంబ నేపథ్యం నుంచి రావాలని, వ్యక్తిత్వ వికాసం మానసికంగా, వృత్తిపరంగా ఎదగడానికి సహాయపడుతుందని ఆయన తెలిపారు. పీఠాధిపతి డాక్టర్ వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో పరిస్థితులను విశ్లేషించి తెలివైన, నమ్మకమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్లో రాణించవచ్చని అన్నారు.
అనంతరం రాజ్మహ్మద్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ బాసాని సురేష్, డాక్టర్ చూరేపల్లి రవి కుమార్, అబ్బు గోపాల్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ డాక్టర్ గంపా సతీష్, బుక్బేరర్ సిద్దోజు సునంద, గెస్ట్ లెక్చరర్ డాక్టర్ నోముల రాజు, సిబ్బంది అంజనేయులు, ఆశోక్, సులోచన, కస్తూరిబాయి, పరిశోధకులు సోనబోయిన సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు.