Bandlaguda : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతకు ఎల్పీజీ గ్యాస్ కష్టాలు కొనసాగుతున్న వేళ బండ్లగూడలోని గ్యాస్ గోదాముల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంగళవారం జరిపిన సోదాల్లో అక్రమంగా గ్యాస్ రీఫల్లింగ్ చేస్తున్న ముఠా పట్టుబడింది. గృహ వినియోగం సిలిండర్లలోని గ్యాస్‌ను వాణిజ్య సిలిండర్లలోకి నింపుతున్న వారిని టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల నుంచి గ్యాస్‌ను వాణిజ్య సిలిండర్లలో నింపి సొమ్ము చేసుకోవాలనుకున్న ముఠా ప్రయత్నాన్ని టాస్క్‌ఫోర్స్ బృందం భగ్నం చేసింది. మెరుపు దాడులు జరిపి.. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంది. వారి దగ్గరి నుంచి 96 డొమెస్టిక్, 58 వాణిజ్య సిలిండర్లు, నాలుగు గ్యాస్ రీఫిల్లింగ్ యంత్రాలు, 50 చిన్న సిలిండర్లు, తూకం మిషన్లతో పాటు ఇతర సామగ్రిని టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.