హైదరాబాద్, ఫిబ్రవరి 23 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొందరపడి వ్యూహాత్మక తప్పిదం చేశారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల తాటాకు చప్పుళ్లకు లొంగిపోయారా? ‘ట్రంప్ విధించిన సుంకాలకు చట్టబద్ధత ఉందా?’ అనే కేసు ఒకవైపు అమెరికా సుప్రీంకోర్టులో విచారణలో ఉండగానే.. కోర్టు తీర్పు రాకముందే.. ట్రంప్ సర్కార్‌తో మోదీ ప్రభుత్వం హడావుడిగా ట్రేడ్ డీల్‌ను పూర్తి చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆప్తమిత్రుడు అదానీపై అమెరికాలో కేసులు కొనసాగుతుండటం, వివాదాస్పద ఎప్స్టీన్ ఫైల్స్‌లో తన పేరు ప్రస్తావనకు రావడం, సుంకాల విషయంలో తన దౌత్యం విఫలమవ్వడం.. వెరసి సర్వత్రా విమర్శలు వస్తుండటంతో దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన ట్రేడ్ డీల్‌ను ప్రధాని మోదీ ఉన్నఫలంగా ఖరారు చేశారా? ఈ ట్రేడ్ డీల్‌తో భారత్ కంటే అమెరికాకే ఎక్కువ లాభం అని తెలిసినప్పటికీ, దేశ ప్రయోజనాలను మోదీ తాకట్టుపెట్టారా? అని ప్రతిపక్ష నాయకులు, రాజకీయ విశ్లేషకులు కేంద్రప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నారు.
తన దారికి రాని దేశాలపై పగబట్టిన ట్రంప్.. టారిఫ్‌ల పేరిట భయపెట్టే ప్రయత్నం చేశారు. భారత్ సహా పలు దేశాలపై 50 శాతం మేర సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ‘ట్రంప్ విధించిన సుంకాలకు చట్టబద్ధత ఉందా?’ అనే కేసు అమెరికా సుప్రీంకోర్టులో కొనసాగుతుండటంతో మిగతా దేశాలు ట్రంప్ టారిఫ్‌లపై వేచి చూసే ధోరణిని ప్రదర్శించాయి. ఈ కేసులో కోర్టు తీర్పు సానుకూలంగా రాకపోతే అమెరికాతో అప్పుడు ఒప్పందం చేసుకోవచ్చని వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. అయితే, తన రూటే సపరేటు అన్నట్టుగా సుప్రీం తీర్పు రాకముందే.. ట్రంప్ సర్కార్‌తో మోదీ ప్రభుత్వం హడావుడిగా ట్రేడ్ డీల్‌ను పూర్తి చేసింది.
ఈ డీల్‌తో దేశీయ సాగు, వ్యాపార రంగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని విమర్శలు వచ్చినప్పటికీ వెనక్కి తగ్గలేదు. అయితే, అమెరికా అధ్యక్షుడు తన అధికార పరిధిని దాటి సుంకాలను విధించారని తప్పుబడుతూ ట్రంప్ టారిఫ్‌లను కొట్టివేస్తూ గత శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అమెరికాతో ట్రేడ్ డీల్‌ను పూర్తి చేసుకోని పలు దేశాలు ఊపిరి పీల్చుకొన్నాయి. ఇదే సమయంలో భారత్ స్పందన ఏమిటా? అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. యూఎస్ సుప్రీంకోర్టు తీర్పుపై ఎట్టకేలకు స్పందించిన కేంద్రం.. తదుపరి పరిణామాలను అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నది.
అంతేకాదు.. వాణిజ్య ఒప్పందంపై జరగాల్సిన ద్వైపాక్షిక చర్చలను వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు చెల్లవని చెప్పిన టారిఫ్‌లను మంగళవారం నుంచి వసూలు చేయబోమని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో తొందరపడి ట్రేడ్ డీల్ చేసుకొన్న మోదీ.. దేశ ప్రయోజనాలను ట్రంప్‌నకు తాకట్టు పెట్టి వ్యూహాత్మక తప్పిదం చేశారని పలువురు విమర్శిస్తున్నారు.
ట్రంప్ సర్కార్‌తో మోదీ ప్రభుత్వం ఉన్నట్టుండి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి పలు కారణాలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో మొదటిది అదానీ వ్యవహారం. రూ. 2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీపై అమెరికాలో 15 నెలల కిందట కేసు నమోదైంది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) నోటీసులను స్వీకరించడానికి అదానీ న్యాయవాదులు అంగీకరించడంతో ఈ కేసు ఇటీవలే చివరి దశకు చేరినట్లయ్యింది.
అమెరికాలోని ఫారెన్ కరప్ట్ ప్రాక్టిసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) ప్రకారం.. నేరం రుజువైతే గౌతమ్ అదానీకి ఐదేండ్ల జైలు శిక్షతో పాటు 2 మిలియన్ డాలర్ల జరిమానా విధించవచ్చని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆప్తమిత్రుడిని కాపాడటానికే మోదీ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గినట్టు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక, అమెరికన్ ఫైనాన్షియల్, లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్కు చెందిన కొన్ని డివైసుల్లో (ఎప్స్టీన్ ఫైల్స్) ప్రధాని మోదీ పేరు ఇటీవల బయటకు వచ్చింది. ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయోజనాల కోసం మోదీ పని చేసినట్టు అమెరికా న్యాయశాఖ సదరు పత్రాల్లో వెల్లడించింది. ఇంకా, మోదీకి సంబంధించిన విషయాలు మరిన్ని ఆ డివైసుల్లో ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సెక్స్ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో మోదీ పేరు రావడం కలకలం సృష్టించింది. దీంతో ఆ వివరాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే మోదీ అమెరికాతో డీల్ కుదుర్చుకొన్నట్టు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు హెచ్1బీ వీసాలు, వలసల విషయంలో అమెరికాతో నెరిపిన దౌత్యంలోనూ మోదీ ఘోరంగా విఫలమయ్యారు. వెరసి.. ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి మోదీ ఈ డీల్‌కు ఒప్పకొని తప్పటడుగు వేశారని రాజకీయ విశ్లేషకులతో పాటు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రతీకార సుంకాలు చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన దరిమిలా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల వసూలును అమెరికా నిలిపివేయనున్నది. సుంకాల విధింపుపై ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం ప్రధాన భాగస్వామ్య దేశాలతో సైతం సంబంధాలను దెబ్బతినేలా చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివాదాస్పద వాణిజ్య సాధనాన్ని ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకునే పరిస్థితి ఏర్పడింది. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) కింద సుంకాల వసూళ్లు మంగళవారం తెల్లవారుజామున స్థానిక కాలమానం 12.01 గంటలకు(భారతీయ కాలమానం ఉదయం 10.30 గంటలకు) నిలిచిపోతాయని అమెరికా కస్టమ్స్, బార్డర్ ప్రొటెక్షన్ ఓ ప్రకటనలో తెలిపింది.
తన కార్గో వ్యవస్థల్లో సంబంధిత అన్ని సుంకం కోడ్లు డీయాక్టివేట్ అవుతాయని దిగుమతిదారులను హెచ్చరించింది. తాత్కాలికంగా సుంకాలు వసూలు చేయడం, లేదా వసూలు చేసిన సుంకాలను వాపసు చేయడంపై మాత్రం సీబీపీ వివరణ ఇవ్వలేదు. ఐఈఈపీఏ కింద విధించిన సుంకాలకు మాత్రమే వసూళ్ల నిలిపివేత వర్తిస్తుందని, సెక్షన్ 232 జాతీయ భద్రతా అధికారాలు, సెక్షన్ 301 అక్రమ వాణిజ్య చట్టాల కింద ఉన్న వాటితోపాటు ట్రంప్ ప్రభుత్వం విధించిన ఇతర సుంకాలపై దీని ప్రభావం ఉండబోదని సీబీపీ స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి చట్టపరమైన, ఆర్థిక పరిణామాలు కొనసాగుతున్నప్పటికీ మరో చట్టపరమైన అధికారం కింద 15 శాతం సుంకాలను ట్రంప్ అమలుచేయడంతో అమెరికా వాణిజ్య విధానంలో పెనుమార్పులేవీ కనిపించడం లేదు. ప్రస్తుతం చెల్లని ఐఈఈపీఏ సుంకాలు రోజుకు 50 కోట్ల డాలర్లకు పైగా ఆదాయం తెస్తున్నందున సుప్రీంకోర్టు తీర్పుతో అమెరికా సుంకాల ఆదాయం 17,500 కోట్ల డాలర్లకు పైగా వాపసు చేయాల్సి వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది.