Harish Rao | మహబూబ్‌నగర్ : వరంగల్ మీటింగ్‌లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు, మహిళలకు పనికొచ్చే ఒక మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కలుపు మొక్క కాదు కల్పవృక్షం అని స్పష్టం చేశారు. కురుమూర్తి దైవదర్శనం అనంతరం మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటా అడ్డదారుల ముఖ్యమంత్రి అయ్యావు. గెలిచిన తర్వాత పేదలను రైతులను తొక్కుకుంటూ అధికారం అనుభవిస్తున్నావు. రేవంత్ రెడ్డి మాటల్లో శబ్దం ఎక్కువ విషయం తక్కువ. రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ ప్రసంగంలో 50 సార్లు కేసీఆర్ పేరు జపం చేశాడు. ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఓటమి భయం మొదలై కేసీఆర్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
కేసీఆర్‌కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉంది. ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షనే. కేసీఆర్ ఆదేశిస్తే మూడుసార్లు రాజీనామా చేశాను. పంద్రాగస్టు లోపల పూర్తి రుణమాఫీ నువ్వు చేసుంటే రైతుల కోసం నేను రాజీనామా చేసేవాడిని. నిన్న వరంగల్ సభలో ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారేమో అని ఆశపడ్డాను. పూర్తి రుణమాఫీ చేస్తానని చెప్తాడేమో అనుకున్నాము కానీ చెప్పలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మహబూబ్ నగర్ బిడ్డనని చెప్పుకుంటూ మహబూబ్ నగర్ పేరును చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. మాటతప్పి పాలమూరు పేరు చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అబద్ధాల నోటికి మొక్కాలి. అబద్ధాలు ఆడడమే రేవంత్ రెడ్డి డిఎన్ఏ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఏమీ కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రైతుబంధు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, బతుకమ్మ చీరలు, దళిత బంధును ప్రజలు కోల్పోయారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ప్రతిపక్షంపై పగ.. ప్రజలకు దగా.. ఇదీ రేవంత్ రెడ్డి తీరు : హరీశ్‌రావు
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు