Harish Rao | సంగారెడ్డి : కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా.. లేక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వా..! అని హరీశ్‌రావు దుయ్యబట్టారు. జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని హరీశ్‌రావు విమర్శించారు. ఆ రాయి ఇవాళ జహీరాబాద్ రైతుల నెత్తిన పడింది. ఫార్మా సిటీ కోసం కేసీఆర్ హైదరాబాద్‌కు దగ్గరగా, కాలుష్య లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాల భూమికి అన్ని క్లియరెన్స్‌లు తెచ్చారు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా సిటీని రద్దు చేసి రియల్ ఎస్టేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వా.. రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? రంగారెడ్డిలో ఫార్మా సిటీ ఉన్నట్టా..? లేనట్టా..? అని హైకోర్టు ప్రశ్నిస్తే ఉన్నది అని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. నిజానికి మూడు నాలుగు వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేసి మిగతా రియల్ ఎస్టేట్ చేయాలనే ప్లాన్‌లో రేవంత్ రెడ్డి ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు.
న్యాలకల్‌లో ఇక్కడి భూములు ఎంత బాగున్నాయ్. పచ్చగా పంటలు పండుతున్నాయి. మూడు పంటలతో సస్య శ్యామలంగా ఉంది. బంగారం వలె ఉన్న భూముల్లో ఫార్మా సిటీ ఏమిటి..? 15 వేల ఎకరాల్లో పెట్టు. ఇక్కడ ఎందుకు పడ్డావు. అక్కడ రియల్ ఎస్టేట్ చేసి, ఇక్కడ కంపెనీలు పెడుతావా? రైతుల ఉసురు పోసుకుంటున్నవు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడుతున్నావ్. పేదల ఇండ్లు కూలగొట్టుడు.. భూములు కొల్లగొట్టుడు.. ఇదేనా ఇందిరమ్మ పాలన..? ఇందిరమ్మ గరీబీ హటావో అంటే, రేవంత్ రెడ్డి కిసాన్ హటావో, గరీబోకో హటావో అంటున్నారు. ఇక్కడి ప్రజలు రెండు నెలల నుండి అన్నం తినడం లేదు. వరంగల్ డిక్లరేషన్‌లో ప్రభుత్వ భూములకు పట్టాలు అన్నావు. ఇప్పుడు గుంజుకుంటున్నావ్. రాహుల్ గాంధీ యాడున్నావ్. రేవంత్ అరాచకాలపై ఎందుకు స్పందించడం లేదు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పు, మా పేదోళ్ల భూముల జోలికి రావొద్దని అని హరీశ్‌రావు సూచించారు.
రేవంత్ రెడ్డి నువ్వు సీఎంవా లేక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వా
ఫార్మాసిటీ పెట్టడానికి 15 వేల ఎకరాల జాగ తయారు చేసి పెట్టి ఉంది.. అక్కడ ఫార్మా సిటీ పెట్టవయ్య అంటే రేవంత్ రెడ్డి అక్కడ రియల్ ఎస్టేట్ ప్రారంభించి బ్రోకర్ అయితాడు అంట – హరీష్ రావు pic.twitter.com/1ZjneweSgm
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024
ఇవి కూడా చదవండి..
KTR | మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది.. ఇంకా శుద్ధి ఎందుకు: కేటీఆర్
PCC President | జర జాగ్రత్తగా మాట్లాడండి.. కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు పీసీసీ చీఫ్ వార్నింగ్