Diabetes | నిద్ర మొత్తం ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. తగినంత నిద్రపోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ తక్కువగా నిద్రపోవడం వల్ల, నిద్రలేమి కారణంగా అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక రోజూ 7 నుండి 9 గంటల పాటు తప్పకుండా నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే తాజా అధ్యయనాలు రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడడానికి, ఇన్సులిన్ నిరోధకత తగ్గడానికి రోజూ 7 గంటల 18 నిమిషాల నిద్రపోవడం చాలా ఉత్తమనని తెలియజేస్తున్నాయి. ఈ అధ్యయనం BMJ Open Diabetes Research and Care అనే జర్నల్ లో ప్రచురించబడింది. శరీరం ఇన్సులిన్ ను ఉపయోగించకపోవడం లేదా ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోవడం వల్ల చూపు కోల్పోవడం, మూత్రపిండాలు వైఫ్యలం చెందడం, గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
రోజురోజుకూ డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఈ అధ్యయనంలో 20 నుండి 80 సంవత్సరాల మధ్య గల వ్యక్తులపై ఇన్సులిన్ సెన్సిటివిటీని అంచనా వేయడానికి eGDR అనే ప్రమాణాన్ని ఉపయోగించారు. eGDR ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఈ పరిశోధనల్లో నిద్ర సమయం, ఇన్సులిన్ సెన్సిటివిటీ మధ్య ప్రత్యేక సంబంధం ఉందని తేలింది. సరిగ్గా 7 గంటల 18 నిమిషాల నిద్ర దగ్గర eGDR అత్యధికంగా ఉందని, అంటే ఈ సమయం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి ఉత్తమంగా పని చేస్తుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. వారం మధ్యలో తక్కువగా నిద్రపోయి వీకెండ్ లో 1 నుండి 2 గంటలు ఎక్కువగా నిద్రపోతే కొంత ప్రయోజనం ఉంటుంది. కానీ ఇప్పటికే సరైన సమయం నిద్రపోతున్న వారు 2 గంటల కంటే ఎక్కువగా అదనంగా నిద్రపోవడం అది ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు.
తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్, అడ్రినల్ హార్మోన్లు పెరుగుతాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అలాగే ఎక్కువగా నిద్రపోవడం వల్ల డిప్రెషన్, తక్కువ శారీరక చలనం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి కూడా మెటబాలిజంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. నిద్ర, మెటబాలిజం మధ్య రెండు దిశల్లో పని చేసే సంబంధం ఉంటుందని రక్తంలో చక్కెర స్థాయిలు నిద్రను దెబ్బతీస్తాయని అలాగే నిద్ర సమస్యలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
కనుక రోజూ తగినంత నిద్రపోవడం చాలా అవసరమని కూడా వారు చెబుతున్నారు. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. నిద్ర పోయే ముందు స్క్రీన్ లను ఉపయోగించకపోవడం మంచిది. సాయంత్రం సమయాల్లో కాఫీని తీసుకోకూడదు. నిద్రించే గది నిద్రకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. రోజూ తగినంత వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. రాత్రి సమయంలో భారీ భోజనాలు, మద్యం, నికోటిన్ వంటి వాటిని తీసుకోకూడదు. ఈ చిట్కాలను పాటించడం వల్ల చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు. రోజూ తగనింత నిద్రించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండడంతో పాటు మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.