Sanju Samson : ఐసీసీ ఈవెంట్లో ఒక్క మ్యాచ్‌లో జట్టును గెలిపిస్తేనే అది గొప్ప విషయం. అలాంటిది ఏకంగా సూపర్ 8, సెమీ ఫైనల్.. ఫైనల్లోనూ విధ్వంసక అర్ధ శతకాలతో భారత జట్టు విజయాల్లో కీలకమయ్యాడు సంజూ శాంసన్ (Sanju Samson). సన్నాహక సిరీస్‌లో న్యూజిలాండ్‌పై ఘోరంగా విఫలమైన సంజూ.. నాకౌట్ మ్యాచ్‌లో టీమిండియాకు పెద్ద దిక్కులా మారడానికి కారణం ఎవరో తెలుసా..? సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar). ఈ విషయాన్ని ఫైనల్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ప్రదానం సమయంలో ఈ చిచ్చరపిడుగే స్వయంగా చెప్పాడు.
పొట్టి ప్రపంచకప్‌ను నిలబెట్టుకున్న భారత జట్టు మూడో ట్రోఫీతో చరిత్ర సృష్టించింది. స్వదేశంలో ఫేవరెట్‌గా అడుగుపెట్టి.. సంచలన ఆటతో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా విజయంలో సంజూ శాంసన్ పాత్రను ఎంత కొనియాడినా తక్కువే. నిరుడు అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటన(Australia Tour)లో బెంచ్‌కే పరిమితమైన ఈ పవర్ హిట్టర్.. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో జట్టుకు కొండంత అండగా మారాడు. పొట్టి క్రికెట్లో అనుభవానికి కొదవలేకున్నా.. నిలకడలేమితో విమర్శలపాలైన సంజూ ఇప్పుడు గెలుపు గుర్రంగా అవతరించాడు. మూడు అర్ధ శతకాలతో కలిపి 261 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్న తనలో ఇంతటి భారీ మార్పులకు కారణం సచిన్ టెండూల్కర్ అని చెబుతున్నాడు శాంసన్.
After winning the Player-of-the-Tournament award at the T20 World Cup, Sanju Samson revealed he had reached out to Sachin Tendulkar for guidance 🤝 pic.twitter.com/LT55EMBwQH
— ESPNcricinfo (@ESPNcricinfo) March 9, 2026
‘గత రెండు మూడు నెలలుగా సచిన్‌తో తరచూ మాట్లాడుతున్నాను. నిరుడు అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో నేను బెంచ్‌కే పరిమితమయ్యాను. పొట్టి సిరీస్‌లో నాకు అవకాశాలు రాలేదు. అలాంటప్పుడు పాజిటివ్ ఆలోచనతో ఉండడం చాలా ముఖ్యం. కానీ, నా వల్ల కాలేదు. దాంతో.. సచిన్‌కు ఫోన్ చేసి మాట్లాడాను. సుదీర్ఘ సమయం ఇద్దరం మాట్లాడుకున్నాం. న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్‌లో వైఫల్యం తర్వాత నా మనసు ముక్కలైంది. నాకు ఏమీ చేయాలో పాలుపోలేదు. నా కలల్ని చెదిరిపోయినట్టు అనిపించింది.
Samson dared to dream ✨ pic.twitter.com/9ZjyCK0bpo
— ESPNcricinfo (@ESPNcricinfo) March 9, 2026
ఆ సమయంలో ఏం చేయాలో తోచలేదు. అయితే.. ఆ దేవుడి ప్రణాళిక మాత్రం వేరేలా ఉంది. వెంటనే సచిన్‌కు ఫోన్ చేసి మాట్లాడాను. వరల్డ్‌కప్ ఫైనల్ ముందు రోజు రాత్రి కూడా సచిన్ ఫోన్ చేసి నేను ఎలా ఉన్నాను అనేది తెలుసుకున్నాడు. క్రికెట్ దిగ్గజమైన సచిన్ నుంచి సలహాలు తీసుకోవడం, స్పష్టతతో ఉండడం, మ్యాచ్‌కు సన్నద్ధమవ్వడం.. పరిస్థితులపై అవగామన పెంచుకోవడం వంటివి ఎంతో ఉపయోగపడ్డాయి. వరల్డ్‌కప్‌లో నేను గొప్పగా రాణించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని శాంసన్ తెలిపాడు.
వరల్డ్‌కప్ లీగ్ దశలో నమీబియాపై తేలిపోయిన శాంసన్.. సూపర్ 8 చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై కసికొద్ది ఆడాడు. 89 నాటౌట్‌తో భారత్‌ను సెమీస్ చేర్చిన సంజూ.. వాంఖడేలోనూ ఇంగ్లండ్‌పై శివమెత్తాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీతో టీమిండియా ఫైనల్ చేరడంలో కీలకమైన అతడు.. ఫైనల్లోనూ దంచేశాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ జతగా 92 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చిన శాంసన్. 89 పరుగుల వద్ద ఔటైనా అప్పటికే భారత్ భారీ స్కోర్‌కు బలమైన పునాది వేశాడు. 256 పరుగుల ఛేదనలో బుమ్రా ధాటికి న్యూజిలాండ్ 159కే కుప్పకూలగా.. వరుసగా రెండోసారి టీమిండియా పొట్టి కప్‌ను ముద్దాడింది.