రొనాల్డో లేని పోర్చుగల్
అర్జెంటీనా, బ్రెజిల్ వంటి దేశాలతో పోలిస్తే ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో పోర్చుగల్ అంత బలమైన జట్టేమీ కాదు. కానీ ఆ దేశాలన్నింటికీ దీటుగా, ప్రపంచవ్యాప్తంగా పోర్చుగల్ జెండాను రెపరెపలాడిస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుందంటే దాని వెనుక ఉన్న కారణం ఒకే ఒక్కడు..!
- జాతీయ జట్టుకు క్రిస్టియానో వీడ్కోలు
- కోచ్‌తో విభేదాలతో అనూహ్య నిర్ణయం..
- అత్యధిక మ్యాచ్‌లు, గోల్స్‌తో ప్రపంచ రికార్డులు
- ఇకపై క్లబ్ సాకర్కే పరిమితం కానున్న సీఆర్7
పోర్చుగల్ ఒక్క వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడకపోయినా, కొన్నేండ్లుగా ప్రతి ప్రపంచ కప్‌లోనూ ఆ జట్టును టైటిల్ ఫేవరెట్‌గా ప్రపంచం లెక్కగట్టడానికి కారణం ఆ ఒక్క శక్తే! అదే క్రిస్టియానో రొనాల్డో. ఆటగాడిగా, నాయకుడిగా తన అసాధారణ ప్రదర్శనతో జాతీయ జట్టు ముఖచిత్రంగా, దేశ ఫుట్‌బాల్‌కు గుండెచప్పుడుగా మారి అద్భుత ఘనతలెన్నో సాధించిన రొనాల్డో అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన దేశ జెర్సీకి వీడ్కోలు పలికాడు. ఈ తరంలో అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీకి సరిసమానుడిగా, ప్రజాదరణలో, సంపాదనలో, గోల్స్ లెక్కల్లో అతడిని మించిన ఈ రికార్డుల రారాజు అంతర్జాతీయ కెరీర్‌కు తెరదించాడు. కొత్త కోచ్‌తో తలెత్తిన వివాదం దరిమిలా.. తాను ఎంతగానో ప్రేమించే, ప్రాణంగా భావించే పోర్చుగల్ జెర్సీని ఇకపై ధరించబోనని ప్రకటించాడు.
రొనాల్డో లేని పోర్చుగల్ జట్టును ఊహించుకోవడం కష్టమే. అయితే, మెస్సీ మాదిరిగానే క్రిస్టియానో కూడా మరికొన్నాళ్లు క్లబ్ సాకర్ మ్యాచ్‌ల్లో తన మ్యాజిక్‌ను కొనసాగించనుండటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ‘సీఆర్7’ అభిమానులకు ఊరటనిచ్చే అంశం. ఏదేమైనా అడుగుపెట్టిన నాటి నుంచి దేశం కోసం ప్రాణం పెట్టి ఆడిన ఆ దిగ్గజ ఆటగాడి శకం ఇలా ముగియడం ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత భావోద్వేగ క్షణం.
లిస్బన్ (పోర్చుగల్): ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ సాకర్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. 23 ఏండ్ల పాటు సాగిన తన అంతర్జాతీయ ప్రయాణానికి ముగింపు పలుకుతూ 41 ఏండ్ల రొనాల్డో గురువారం సోషల్ మీడియాలో విడుదల చేసిన ఐదు నిమిషాల వీడియో సందేశంలో భావోద్వేగ ప్రకటన చేశాడు. పోర్చుగల్ జాతీయ జట్టు హెడ్ కోచ్ జార్జ్ జెసుస్తో ఏర్పడిన విభేదాలు, అసంతృప్తి కారణంగానే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. సెప్టెంబర్ 24న నేషన్స్ లీగ్‌లో వేల్స్‌పై సాధించిన 1-0 విజయంలో రొనాల్డో ఆడిన మ్యాచ్‌నే అతడికి పోర్చుగల్ జెర్సీలో చివరిదిగా మిగిలిపోయింది.
ఆ తర్వాతి మ్యాచ్‌లో కోచ్ అతడిని బెంచ్ కే పరిమితం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రొనాల్డో ట్రెయినింగ్ క్యాంప్ వీడాడు. 2003 ఆగస్ట్ 20న కజకిస్తాన్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌తో 18 ఏండ్ల వయసులో పోర్చుగల్ సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రొనాల్డో 2004 యూరోపియన్ చాంపియన్‌షిప్ ఆరంభ మ్యాచ్‌లో గ్రీస్‌పై తొలి అంతర్జాతీయ గోల్ కొట్టాడు. 2007లో పోర్చుగల్ జట్టు కెప్టెన్సీ అందుకున్న అతను 2023లో (ఐస్లాండ్పై) 200 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తొలి ప్లేయర్‌గా గిన్నిస్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 23 ఏండ్ల కెరీర్లో 234 మ్యాచ్‌లు, 146 అంతర్జాతీయ గోల్స్ ప్రపంచ రికార్డుతో తన జాతీయ జట్టుకు అధికారికంగా వీడ్కోలు ప్రకటించాడు.
ఈ బాధ్యత భవిష్యత్ తరానిది..
తన వీడ్కోలు వీడియోలో మాట్లాడుతూ రొనాల్డోభావోద్వేగానికి గురయ్యాడు. ‘పోర్చుగల్ ప్రజలారా.. జాతీయ జట్టు 7వ నంబర్ జెర్సీని తిరిగి ఇచ్చేసే రోజు వచ్చింది. 23 ఏండ్ల పాటు ఈ జెర్సీని ధరించి ప్రపంచవ్యాప్తంగా పోర్చుగల్ జెండాను మోసే భాగ్యం, బాధ్యత నాకు లభించాయి. ఇది కేవలం నా ఒక్కడిది కాదు. ఈ రోజు దీనిని భవిష్యత్తు తరాలకు అందిస్తున్నాను. 2003 ఆగస్ట్‌లో కజకిస్తాన్‌పై ప్రారంభమైన నా ప్రయాణం నా జీవితాన్ని మార్చివేసింది. నేను మైదానంలో గెలవడానికే ఆడాను, సరికొత్త చరిత్ర సృష్టించాలనుకున్నాను. జాతీయ జట్టు కోసం నా సర్వస్వాన్ని ధారపోశాను. నా సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మినందుకు, మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు.
సాధారణ జట్టును అసాధారణంగా మార్చిన మొనగాడు
రొనాల్డో అంతర్జాతీయ అరంగేట్రం (2003) చేయకముందు ఫుట్‌బాల్ చరిత్రలో పోర్చుగల్ జట్టు మూడు సార్లు మాత్రమే వరల్డ్ కప్‌కు (1966, 1986, 2002), మరో మూడు సార్లు మాత్రమే యూరో కప్‌కు అర్హత సాధించింది. ఒక్క అంతర్జాతీయ ట్రోఫీ కూడా లేదు. కానీ రొనాల్డో వచ్చాక పోర్చుగల్ రూపురేఖలే మారిపోయాయి. తన హయాంలో పోర్చుగల్ ప్రతి వరల్డ్ కప్, ప్రతి యూరో కప్‌కు అర్హత సాధించింది. పైగా, 2016లో ఫ్రాన్స్‌ను ఓడించి పోర్చుగల్‌కు తొలిసారి యూరోపియన్ చాంపియన్‌షిప్‌ను అందించాడు. దీనికి తోడు 2019, 2025లో తన జట్టును రెండుసార్లు యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ విజేతగా నిలిపాడు.
ఇక మెరుపులు క్లబ్ టోర్నీల్లోనే
రొనాల్డో వీడ్కోలుపై స్పందించిన పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య తను ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ అని కొనియాడింది.‘రొనాల్డో సేవలకు అపారమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రపంచంలో పోర్చుగల్ స్థాయిని పెంచి, కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. మా దృష్టిలో అతడే ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్’ అని కొనియాడింది. అభిమానులందరితో కలిసి రొనాల్డోకు ఘనమైన వీడ్కోలు సత్కారం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు స్వస్తి చెప్పినా, రొనాల్డో క్లబ్ ఫుట్‌బాల్‌ను కొనసాగించనున్నాడు. సౌదీ అరేబియాలోని అల్-నాసర్ క్లబ్ తరఫున ఆడుతున్న రొనాల్డో, తన కెరీర్లో వెయ్యి అధికారిక గోల్స్ సాధించే చారిత్రక మైలురాయికి కేవలం 15 గోల్స్ (ప్రస్తుతం 985) దూరంలో ఉన్నాడు. జాతీయ జట్టులో రొనాల్డో ప్రస్థానం ముగిసినా, క్లబ్ మైదానాల్లో అతడి విధ్వంసం కొనసాగనుంది.
ఆ ఒక్క కప్పు నెగ్గలేక..
పోర్చుగల్‌కు రెండు నేషన్స్ కప్‌లు, ఓ యూరో ట్రోఫీ అందించిన రొనాల్డో తన చిరకాల స్వప్నమైన ఫిఫా వరల్డ్ కప్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. 2006లో ప్రపంచకప్‌లో ఆటగాడిగా జట్టును సెమీస్ చేర్చడమే మెగా టోర్నీలో అతడి అత్యుత్తమ ప్రదర్శన. నాయకుడిగా పగ్గాలు అందుకున్నాక 2022 ఖతార్‌లో క్వార్టర్స్ వరకూ తీసుకెళ్లాడు. అదే టోర్నీలో తన సమఉజ్జీ మెస్సీ అర్జెంటీనాకు కప్పు అందించి.. ఈ ఏడాది తన జట్టును మరోసారి ఫైనల్ చేర్చాడు. కానీ, క్రిస్టియానో మాత్రం కలల కప్పును అందుకోకుండానే అంతర్జాతీయ ఆట ముగించాడు.
రికార్డుల రారాజు
234 రొనాల్డో ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు. పురుషుల ఫుట్‌బాల్ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు
146 అంతర్జాతీయ గోల్స్.. ప్రపంచంలోనే అత్యధికం.
6 ఆరు వేర్వేరు వరల్డ్ కప్స్‌లో (2006, 10, 14, 18, 22, 26) గోల్స్ చేసిన తొలి ఆటగాడు
11 వరల్డ్ కప్స్‌లో పోర్చుగల్ తరఫున అత్యధికంగా
11 గోల్స్ కొట్టాడు.
30 యూరో కప్‌లో అత్యధిక మ్యాచ్‌ల రికార్డు రొనాల్డోదే. ఆరు ఎడిషన్లలో ఆడిన ఏకైక ప్లేయర్‌గా నిలిచి అత్యధికంగా 14 గోల్స్ కొట్టాడు.
23 రొనాల్డో 2004 నుంచి 2026 వరకు వరుసగా 23 క్యాలెండర్ ఇయర్లలో పోర్చుగల్ తరఫున గోల్స్ కొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

