Stock Markets : పశ్చిమాసియాలో ఇరాన్ (Iran) పై అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) దాడులు.. ఇరాన్ ప్రతిదాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఉద్రిక్తతల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ (Sensex) 1,352.74 పాయింట్లు పతనమై 77,566.16 వద్ద స్థిరపడింది.
అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సూచీ నిఫ్టీ (Nifty) 422.40 పాయింట్లు నష్టపోయి 24,028.05 వద్ద ముగిసింది. ముఖ్యంగా నిఫ్టీ తన ఆల్ టైమ్ హై నుంచి 10 శాతానికిపైగా పతనమై అధికారికంగా ‘కరెక్షన్ జోన్’ లోకి ప్రవేశించింది. జనవరి 5న నిఫ్టీ 26,373 స్థాయిని తాకింది. అయితే సెషన్ మధ్యలో ముడిచమురు ధరలు కాస్త తగ్గడంతో మార్కెట్లు ఇంట్రాడే కనిష్ఠ స్థాయిల నుంచి కొంతమేర కోలుకున్నాయి. కనిష్టస్థాయి 23,868 నుంచి నిఫ్టీ 160 పాయింట్లు, 76,424 నుంచి సెన్సెక్స్ 1,142 పాయింట్లు రికవరీ అయ్యాయి.
విస్తృత మార్కెట్లలో సైతం నష్టాలు తప్పలేదు. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.97 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.22 శాతం మేర క్షీణించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా 3.97 శాతం పతనమైంది. మరోవైపు ఐటీ రంగం మాత్రం సానుకూలంగా స్పందించి 0.08 శాతం స్వల్ప లాభంతో ముగిసింది. ప్రస్తుత పరిస్థితులపై మార్కెట్ నిపుణులు స్పందించారు.
నిఫ్టీకి 23,700–23,600 వద్ద తక్షణ మద్దతు లభిస్తుందని అన్నారు. ఒకవేళ ఆ స్థాయిని కోల్పోతే 23,400–23,300 వైపు పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. మార్కెట్ కోలుకోవాలంటే 24,300, 24,600 స్థాయిలను దాటాల్సి ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో అమెరికా-ఇరాన్ పరిణామాలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులపైనే మార్కెట్ కదలికలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.